-

కాంగ్రెస్‌కు మద్దతుపై ఏచూరి వర్సెస్‌ తమ్మినేని 

27 Nov, 2023 09:18 IST|Sakshi

‘ఇండియా’ కూటమిలో ఉన్నందున రాష్ట్రంలో కాంగ్రెస్‌కే ఏచూరి మద్దతు

కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఎక్కడా చెప్పని తమ్మినేని వీరభద్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు విషయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగాం. కాబట్టి మేం పోటీ చేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓటేయ్యాలి’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చాలా స్పష్టంగా చెప్పారు.

కానీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అలాంటి స్పష్టత ఎక్కడా ఇవ్వడంలేదు. ‘మా పార్టీ పోటీ చేసే 19 నియోజకవర్గాలు మినహా బీజేపీ బలంగా ఉన్నచోట్ల దానిని ఓడించగల పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ, శేర్‌లింగంపల్లిలో ఎంసీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. మిగిలిన స్థానాలలో ఎవరిని బలపరచాలో పార్టీ జిల్లా కమిటీలు తగు నిర్ణయం తీసుకొని ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక, పోరాట శక్తులకు మద్దతు ఇస్తాయ’ని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
చదవండి: రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో?

ఇక్కడ ఏచూరి ప్రకటనకు, తమ్మినేని ప్రకటనకు మధ్య వైరుధ్యం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘ఇండియా’కూటమిలో ఉన్నందున తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఏచూరి స్పష్టం చేయగా, తమ్మినేని మాత్రం అలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీని ఓడించగలిగే పార్టీలకు ఓటు వేయాలని కోరుతున్న తమ్మినేని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయమని ఎందుకు పిలుపునివ్వడంలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. 

ఏచూరికి సమాచారం ఇవ్వలేదా?  
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నచోట దాన్ని ఓడించే పార్టీలకు ఓటేయ్యాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీజేపీ బలంగా లేనిచోట ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపైనే కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య భిన్నాభిప్రాయం నెలకొంది.. సీతారాం ఏచూరికి రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని తెలియజేయలేదని తెలిసింది. కాగా, తాము పోటీ చేస్తున్న 19 స్థానాలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు.
చదవండి: డిసెంబర్‌ 4న జాబ్‌ కేలండర్‌ ఇస్తాం: కేటీఆర్‌

మరిన్ని వార్తలు