రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్‌.. జైల్లో ఉండడంతో ఓటింగ్‌కు నో

9 Jun, 2022 15:47 IST|Sakshi
నవాజ్‌ మాలిక్‌(ఎడమ), అనిల్‌ దేశ్‌ముఖ్‌ (కుడి)

రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్‌ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్‌ దేశ్‌ముఖ్‌, మంత్రి నవాబ్‌ మాలిక్‌లకు రాజ్యసభ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించింది ముంబై కోర్టు. ఈ మేరకు అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న ఈ ఇద్దరికీ బెయిల్‌ నిరాకరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. 

ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌(PMLA)యాక్ట్‌ ప్రకారం వేర్వేరు కేసుల్లో ఈ ఇద్దరూ అరెస్ట్‌ అయ్యారు. మాజీ మంత్రి దేశ్‌ముఖ్‌ ప్రస్తుతం ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉండగా.. కేబినెట్‌​ మంత్రి నవాబ్‌ మాలిక్‌ మాత్రం అనారోగ్యకారణంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం(జూన్‌ 10న) రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది.

అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాలని, ఒక్కరోజు ఎస్కార్ట్‌తో కూడిన తాత్కాలిక బెయిల్‌ మంజూర్‌ చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని పిటిషన్‌ ద్వారా అభ్యర్థించారు. బుధవారం ఈ పిటిషన్‌కు సంబంధించి సుదీర్థ వాదనలు జరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైల్లో ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదని వాదించారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ రోకడే.. బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 

2017లో మనీల్యాండరింగ్‌ కేసులో శిక్ష అనుభవించిన ఆనాటి కేబినెట్‌ మంత్రి చగ్గన్‌ భుజ్‌బల్‌.. కోర్టు అనుమతి ద్వారా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓటు వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు దేశ్‌ముఖ్‌ తరపు న్యాయవాది. అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. 

మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌.. మంత్రిగా ఉన్న సమయంలో వివిధ పబ్‌ల నుంచి పోలీసుల ద్వారా నాలుగున్నర కోట్ల రూపాయలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ నవంబర్‌ 2021లో  ఆయన అరెస్ట్‌ అయ్యారు. 

అలాగే మహారాష్ట్ర మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. దావూద్‌ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు ఈడీ ఆయన్ని అరెస్ట్‌ చేసింది.

మరిన్ని వార్తలు