నన్ను లాక్‌ చేశారని ఎవరు చెప్పారు?

27 Jul, 2020 12:38 IST|Sakshi

కుటుంబంతో సరాదాగా: రెబల్‌ ఎమ్మెల్యే

జైపూర్‌: రాజస్తాన్‌ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను హోటల్‌లో బంధించారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్‌ స్పందించారు. భార్యా, కొడుకుతో తాను సరదాగా గడుతున్నానంటూ... ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ మేరకు.. ‘‘నన్ను లాక్‌ చేశారని ఎవరు చెప్పారు? కుటుంబంతో సాయంత్రం! అనిరుద్‌ తన ప్లేట్‌లో ఉన్న పదార్థాలేవీ ఎప్పుడూ పూర్తి చేయడు. నాతో మాటలు పడుతూనే ఉంటాడు! ఇక శ్రీమతి తన డైట్‌ను పక్కన పెట్టేశారు!’’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తాము హర్యానాలోని గురుగ్రాంలో గల ఒబెరాయ్‌ హోటల్‌లో ఉన్నట్లు వెల్లడించారు. (గెహ్లోత్‌ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్‌ )

కాగా విశ్వేంద్ర సింగ్‌.. డీగ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజస్తాన్‌ మంత్రిగా ఉన్న ఆయన.. అశోక్‌ గెహ్లోత్‌ సర్కారుకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ వర్గంలో ఉన్నారు. ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ బలవంతంగా హోటల్‌కు తరలించి, బంధించందంటూ సీఎం గెహ్లోత్‌ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేయడం గమనార్హం. కాగా సచిన్‌ పైలట్‌ సహా ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ సీపీ జోషి అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఊరట కల్పించిన రాజస్తాన్‌ హైకోర్టు.. సోమవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్పీకర్‌.. తాజాగా తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా