ఎస్‌ఎల్‌బీసీపై నిర్లక్ష్యపు కుట్ర 

8 Jun, 2023 02:36 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ సర్కారు తీరుతో పాలమూరు, నల్లగొండ జిల్లాలకు నష్టం 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజం 

అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగానే నిర్లక్ష్యం చేస్తూ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా 83వ రోజు ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. గ్రావిటీ ద్వారా 4లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు ఇచ్చేలా డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టుకు రూ.2,259 కోట్లు మంజూరు చేసి 2008 మార్చి 26న టీబీఎం మిషన్‌ ప్రారంభించారని భట్టి చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో 23.5 కిలోమీటర్ల సొరంగం పనులు జరిగితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కిలోమీటర్ల మేర మాత్రమే పని జరిగిందన్నారు. ఈ ప్రభుత్వ కాలయాపనతో అంచనా వ్యయం 4,776.42 కోట్లకు పెరిగిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ నుంచి నీళ్లు తీసుకుపోవాలనే సోయి నల్లగొండ జిల్లా మంత్రికైనా ఉండాలి కదా? ఆయన పదేళ్లుగా ఏం చేస్తున్నట్లు? అని భట్టి ప్రశ్నించారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీలాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే మిషన్‌ భగీరథకు రూ.42వేల కోట్లు ఖర్చుచేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఆయన వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు.

మరిన్ని వార్తలు