వికేంద్రీకరణ ఎందుకు వద్దో చెప్పాలి: సజ్జల

31 Mar, 2023 17:09 IST|Sakshi

చంద్రబాబును నిలదీసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ వైఖరి ఎందుకు మారింది?

సీపీఐ మద్దతు పేదలకా.. చంద్రబాబు పెత్తందార్లకా?

వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది సీఎం అభిమతం

మూడు రాజధానులే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానం

చట్ట ప్రకారం రామోజీరావుపై చర్యలు తప్పవు

సాక్షి, అమరావతి : వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ.. తన విధానాన్ని ఇప్పుడెందుకు మార్చుకుందో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడిన చంద్రబాబు నేతృత్వంలోని పెత్తందార్లకు సీపీఐ ఎందుకు మద్దతు ఇస్తోందని ప్రశ్నించారు.

వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతమని.. మూడు రాజధానులే తమ విధానమని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు, బినామీలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి.. రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కాజేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా లక్షల కోట్లు కొట్టేయాలని పథకం వేశారన్నారు. దాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ భగ్నం చేయడంతో చంద్రబాబు పెట్టుబడిదారులైన తన బినామీలతో అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని మండిపడ్డారు.

అమరా­వతి­లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు వ్యయం అవుతుందని.. అంత భారీ మొత్తం ఒకే చోట ఖర్చు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అమరావతిలో అధిక శాతం మంది రైతులు భూములు అమ్మేసుకున్నారని.. భూములకు సకాలంలో కౌలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. భూ సమీకరణతో చంద్రబాబు వేలాది మంది రైతులు, కూలీల పొట్ట కొడితే.. పోరాడాల్సిన సీపీఐ అప్పట్లో ఏం చేసిందని నిలదీశారు. ఇప్పుడు రైతు కూలీలకు సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయం చేస్తున్నారని వివరించారు.  వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతల వైఖరి పట్ల అమరావతిలో నిరసన తెలిపారేగానీ ఎవరూ దాడి చేయలేదన్నారు. 

సీపీఐ కాదది.. చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా 
పోలవరానికి నిధులు, విభజన చట్టంలోని అంశాల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధా­ని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మం­త్రి నిర్మలా సీతారామన్‌లతో సమావే­శమైతే.. దానిపై సీపీఐ నేత నారాయణ తన స్థాయి­కి తగి­నట్లు కాకుండా చిల్లర మాటలు మాట్లా­డుతు­న్నారని సజ్జల మండిపడ్డారు. పేద ప్రజల పక్షాన పోరాడాల్సిన సీపీఐ.. చంద్రబాబు పక్షాన నిలబ­డుతున్నందున ఆ పార్టీ పేరును చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియాగా మార్చుకుంటే సరిపోతుందంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. రైతుల అంగీకారం లేకుండా రాజధానిలోనైనా, కియా వంటి పరిశ్రమలకైనా బలవంతంగా భూములు లాక్కుంటే.. అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం వెనక్కు ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారని.. అందులో తప్పేముందో చెప్పాలని చంద్రబాబు, లోకేలను నిలదీశారు. 

రామోజీ రాజ్యాంగానికి అతీతుడా? 
మార్గదర్శి చిట్‌ ఫండ్స్, ఫైనాన్స్‌లో చిట్స్‌ వేసిన, డిపాజిట్‌ చేసిన ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడం, భద్రత కల్పించడంలో భాగంగానే ప్రభుత్వం సీఐడీతో దర్యాప్తు చేయిస్తోందని.. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని సజ్జల తేల్చి చెప్పారు. మార్గదర్శి ఫైనాన్స్, చిట్స్‌లో అక్రమాలు జరిగినట్లు సీఐడీ దర్యాప్తులో తేలుతోందన్నారు. అగ్రి గోల్డ్, సహారా వంటి సంస్థలపై ‘ఈనాడు’లో కథనాలు అచ్చేసిన రామోజీరావు.. ఆ సంస్థల తరహాలోనే మార్గదర్శిలో అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. వాటిని బహిర్గతం చేస్తుంటే తట్టుకోలేకే ప్రభుత్వంపై విషం చిమ్ముతూ రోజుకో తప్పుడు కథనాన్ని ‘ఈనాడు’లో అచ్చేస్తున్నారని మండిపడ్డారు. రామోజీరావు మీడియా రౌడీయిజం ఇక చెల్లదని, దేశంలో అందరికీ ఒకే రాజ్యాంగం వర్తిస్తుందని స్పష్టం చేశారు. రామోజీరావు అందుకు అతీతుడేమీ కాదని, తప్పు చేసినందున చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.  

చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?

మరిన్ని వార్తలు