హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం.. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్‌ సమాధానం చెప్పాలి

19 Feb, 2022 08:57 IST|Sakshi

ఇలా ప్రత్యర్థులను దెబ్బతీయడం బాబుకు రివాజే

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు

వైఎస్‌ రాజారెడ్డిని, వైఎస్‌ వివేకాను హత్య చేసింది టీడీపీ నేతలే

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంపైనా అనుమానాలున్నాయి

వివేకా హత్యపై వాస్తవాలను కాదని కట్టుకథతో సీబీఐ చార్జిషీట్‌ 

దీనిపై సీబీఐని ప్రశ్నించాం.. ఇప్పుడు బాబునూ ప్రశ్నిస్తున్నాం

సాక్షి, అమరావతి: హత్య, కుట్రలు, కుతంత్రపు రాజకీయాలతో ప్రత్యర్థులను దెబ్బ తీయడం తన నైజమని టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు మరోసారి చాటి చెప్పుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 1999 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డిని.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ వివేకానందరెడ్డిని టీడీపీ నేతలు అంతమొందించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేశారని మండిపడ్డారు. 2009 సెప్టెబరు 2న హెలికాఫ్టర్‌ దుర్ఘటనలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడంపైనా తమకు అనుమానాలున్నాయని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

రాజకీయాల్లోకి వైఎస్‌ జగన్‌ రాక ముందే.. ఆయన్ను మొగ్గలోనే తుంచేయాలనే కుట్రతో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు అదే రీతిలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. అధికారాన్ని చేజిక్కించుకుని, కుంగిపోయేలా చేసి.. ఆయన మరణానికి చంద్రబాబు కారకుడయ్యాడనే విమర్శలను గుర్తు చేశారు. ‘వైఎస్‌ వివేకా, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు. ప్రేమ, అభిమానాలకు వైఎస్‌ కుటుంబం పెట్టింది పేరు. నువ్వు మాత్రం కుటుంబమంటే నువ్వు, నీ భార్య, నీ కుమారుడు లోకేష్‌ మాత్రమే అనుకుంటావు’ అంటూ దుయ్యబట్టారు. వైఎస్‌ వివేకా హత్య కేసుపై సిట్‌ విచారణ చేస్తున్నా.. సీబీఐ విచారణ చేయిస్తామని హైకోర్టు ప్రతిపాదిస్తే.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సీఎం వైఎస్‌ జగన్‌ అందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఓ ఘటనపై నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలని సూచించారు.

బాబుకు మళ్లీ ఓటమి తప్పదు 
అబద్ధానికి మనిషి రూపమే చంద్రబాబు. జగన్‌పై ఎన్నో కుట్రలు చేశారు. అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టించారు. అంతా చేసి, 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే అధికారం చేజిక్కించుకున్నారు.  
ఆ తర్వాత ఎన్ని కుట్రలు చేసినా 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని ఆపలేకపోయారు. ‘నిజం నిప్పులాంటిది. ఆ నిప్పే చంద్రబాబును రాజకీయంగా దహించి వేసింది. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును ఇదే రీతిలో ప్రజలు చెత్తబుట్టలో పడేస్తారు. చంద్రబాబులానే లోకేష్‌ కూడా పనికి రాకుండా తయారయ్యారు.

ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్‌ సమాధానం చెప్పాలి
ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి.. అదే నిజమని నమ్మించే కుట్రలో భాగంగా వైఎస్‌ అవినాష్‌పై సీబీఐ చార్జిషీట్‌ను పట్టుకుని చంద్రబాబు, ఎల్లో మీడియా నీచాతి నీచమైన రీతిలో దుష్ప్రచారం చేస్తున్నాయి. సీబీఐ కంటే చంద్రబాబే మెరుగైన రీతిలో దర్యాప్తు చేస్తాడేమో! ఈ నేపథ్యంలో సీబీఐకి వేసిన ప్రశ్నలే.. చంద్రబాబుకూ వేస్తున్నాం. వాటికి సరైన సమాధానాలు చెప్పగలరా?

మరణానికి ముందు వైఎస్‌ వివేకా స్వహస్తాలతో రాసిన లేఖ ఆయన పీఏ కృష్ణారెడ్డికి ఉదయమే దొరికితే.. అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? అప్పుడే బయట పెట్టి ఉంటే అది హత్య అని అప్పుడే బహిర్గతమయ్యేది కదా? అప్పుడు మృతదేహాన్ని కదపడానికి గానీ, రక్తపు మరకలను తుడవటానికి గానీ ఎవరైనా సాహసించి ఉండేవారా? ఎదురుగా కన్పించే ఈ ఆధారాన్ని సీబీఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు? 
వైఎస్‌ వివేకా వద్ద లేఖ దొరికిందని పీఏ కృష్ణారెడ్డి.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తానొచ్చే వరకూ లేఖను బయటపెట్టవద్దని అతను చెబితేనే లేఖను దాచిపెట్టారు. ఈ అంశంలో రాజశేఖరరెడ్డిని ఎందుకు విచారించలేదు? దీనిపై సమాధానం చెప్పాలని సీబీఐని అడిగాం. సీబీఎన్‌నూ అడుగుతున్నాం. 
వైఎస్‌ వివేకా గుండెపోటుతో మృతి చెందారని ఆయన బావమరిది శివప్రకాష్‌ రెడ్డే తనకు ఫోన్‌ చేసి చెప్పారని.. అప్పట్లో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి.. మంత్రి పదవి దక్కించుకున్న చంద్రబాబు ఏజెంటు, ఇటీవల బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డి సిట్‌ విచారణలో స్పష్టంగా చెప్పారు. మరి గుండెపోటు అంశాన్ని తెరపైకి తెచ్చిన శివప్రకాష్‌రెడ్డిని ప్రశ్నించరేం? 
ఆ శివప్రకాష్‌రెడ్డే.. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి కూడా ఫోన్‌ చేసి వివేకా మరణించిన విషయం చెప్పారు. దాంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్న అవినాష్‌రెడ్డి వెనక్కి తిరిగొచ్చి.. వైఎస్‌ వివేకా ఇంటికి చేరుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వైఎస్‌ వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత ప్రచారం చేసింది శివప్రకాష్‌రెడ్డి కాదా? కానీ.. సీబీఐ ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి.. వైఎస్‌ వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత ప్రచారం చేసింది అవినాషేనని ఎలా అనుమానిస్తుంది? సిట్‌ విచారణలో వెల్లడైన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా? 
అవినాష్‌రెడ్డి వివేకా ఇంటికి చేరుకోక ముం దే.. అప్పటికే అక్కడున్న ఎర్ర గంగిరెడ్డి తదితరులు రక్తపు మరకలను తుడిచారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అవినాష్‌.. సీఐ శంకరయ్యను రప్పించారు. సీబీఐ ఆరోపించినట్లుగా అవినాష్‌రెడ్డి హత్య చేయించి ఉంటే ఆయనే పోలీసులనెందుకు పిలుస్తారు? సీబీఐ, బాబు సమాధానం చెప్పాలి. 

అవినాష్‌ను గెలిపించాలని వివేకా ప్రచారం  
వైఎస్‌ విజయమ్మ, షర్మిలమ్మ, లేదా తనకు కడప ఎంపీ టికెట్‌ ఇవ్వాలని వైఎస్‌ వివేకా కోరారని.. దాంతో తనకు టికెట్‌ దక్కదనే నెపంతోనే అతడిని డి.శంకర్‌రెడ్డి ద్వారా వైఎస్‌ అవినాష్‌ హత్య చేయించి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్నామని సీబీఐ చా ర్జిషీట్‌లో పేర్కొంది. కానీ.. వైఎస్‌ అవినాష్‌ అప్పటికే కడప సిటింగ్‌ ఎంపీ. కడప ఎంపీగా అవినాష్‌ను గెలిపించాలని కాలికి బలపం కట్టుకుని వైఎస్‌ వివేకా ప్రచారం చేశారు. హత్యకు ముందు రోజు కూడా ప్రచారం చేశారు. వైఎస్‌ వివేకా హత్యకు గురైన పది రోజుల తర్వాత ఆయన కూతురు సునీతమ్మ కూడా వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడం, కడప ఎంపీగా వైఎస్‌ అవినాష్‌ను గెలిపించడం కోసం వైఎస్‌ వివేకా చివరి క్షణం వరకూ ప్రయత్నించారని చెప్పారు. కావాలంటే అప్పటి వీడియోలు చూడండి.  
దీనిని బట్టి వైఎస్‌ వివేకా టికెట్టే ఆశించలేదన్నది స్పష్టమవుతోంది. కానీ.. ఓ కట్టుకథ అల్లి చార్జిషీట్‌ వేయడం సమంజసమా? అని సీబీఐని ప్రశ్నించాం. ఇప్పుడు చంద్రబాబునూ నిలదీస్తున్నాం. 

మరిన్ని వార్తలు