సర్జికల్‌ స్ట్రైక్‌ చేయండి: సంజయ్‌ రౌత్‌

10 Dec, 2020 13:28 IST|Sakshi

ముంబై: కేం‍ద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన వెనక పాకిస్తాన్, చైనా హస్తం ఉందంటూ కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ స్పందించారు. రైతుల ఉద్యమం వెనక చైనా, పాక్‌ హస్తం ఉన్నది నిజమే అయితే ఆ రెండు దేశాల మీద సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రౌత్‌ మాట్లాడుతూ.. ‘రైతుల ఉద్యమం వెనక పాక్‌, చైనా హస్తం ఉందని స్వయంగా ఓ కేంద్రమంత్రి ప్రకటించారు. అలాంటప్పుడు ఆ రెండు దేశాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాల్సిందే. రక్షణ శాఖ మంత్రి వెంటనే దీని గురించి రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ ఉన్నతాధికారులతో సీరియస్‌గా చర్చించి.. వెంటనే రంగంలోకి దిగాలి’ అంటూ రౌత్‌ ఎద్దేవా చేశారు. (చదవండి: ప్రభుత్వం నా చెప్పుల్ని చోరీ చేయించింది)

రావుసాహేబ్‌ దాన్వే రైతుల ఉద్యమం గురించి మాట్లాడుతూ.. ‘ఇది రైతులు చేస్తోన్న ఆందోళన కాదు. దీని వెనక పాక్‌, చైనాల హస్తం ఉంది. దేశంలో ఏం జరిగినా వెంటనే ముస్లింలను ప్రేరేపిస్తారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అమల్లోకి వస్తే ఆరు నెలల్లో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఎంత మంది ముస్లింలు దేశం నుంచి వెళ్లిపోయారో చెప్పాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. రావుసాహేబ్‌ వ్యాఖ్యల్ని ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్‌ కమిటీ కూడా ఖండించింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు