Pakistan Air Pollution: పాక్‌నూ కాటేస్తున్న వాయుకాలుష్యం

18 Nov, 2023 14:05 IST|Sakshi

భారత్ మాత్రమే కాదు.. పాకిస్తాన్‌లోనూ గాలి అత్యంత విషపూరితంగా మారింది. పాక్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లాహార్‌ పొగమంచు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురి జీవనోపాధి దెబ్బతింటోంది. 

స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్‌లో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధ్వాన్నంగా ఉంది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘ప్రమాదకర’ స్థాయిని సూచిస్తూ 470 వద్ద ఉంది. పాక్‌ మీడియా డాన్ పేర్కొన్న వివరాల ప్రకారం వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం, పంటలను కాల్చడం కారణంగానే కాలుష్యం కమ్ముకుంది.

పొగమంచు కారణంగా లాహోర్‌ నగరంలో దృశ్యమానత(విజిబులిటీ) తగ్గింది. వైమానిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. లాహోర్‌కు చెందిన పలువురు విషపూరితమైన గాలి కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధుల బారిన పడ్డారని తెలుస్తోంది. పొగమంచు నుండి తప్పించుకునేందుకు కొందరు నగరాన్ని విడిచిపెట్టారు. పాక్‌లోని లాహోర్, పంజాబ్‌లలో పొగమంచు సంక్షోభం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా?

మరిన్ని వార్తలు