13 సార్లు ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి

24 Oct, 2023 08:08 IST|Sakshi

వట్‌పల్లి(అందోల్‌): అందోలులో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా మారింది. ఆ సెంటిమెంట్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. నవంబర్‌ 30వ తేదీన జరిగే ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు మొదలు పెట్టాయి. ఇరు పారీ్టల అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉండగా, స్థానికంగా ఎవరు గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న చర్చ ప్రారంభమైంది.  

బీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అభ్యర్థిత్వాలు ఇది వరకే ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు దూసుకుపోతున్నాయి. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీఎస్‌పీ తరఫున ముప్పారం ప్రకాష్‌ పేరును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందోలు ఫలితాలపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

8 సార్లు కాంగ్రెస్‌దే గెలుపు 
అందోలు నియోజకవర్గం 1952లో ఏర్పడగా, 1967లో ఎస్సీ రిజర్వుడుగా మారింది. 1952 నుంచి 1985 వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. 1985లో తొలిసారిగా టీడీపీ నుంచి మల్యాల రాజయ్య విజయం సాధించారు. 1989లో దామోదర రాజనర్సింహ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో సినీనటుడు బాబూమోహన్‌ ఎన్నికై తిరిగి 1999–2000 సంవత్సరంలో రెండో సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు, ఒక్కసారి ఇండిపెండెంట్‌ అభ్యర్థి, రెండు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 

ముహూర్తాలు కలిసొచ్చేనా?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఏ తేదీన, ఏ సమయంలో వేయాలో జాతకాలు చూపించుకుంటున్నారు. ఈ సారి నామినేషన్లను పోటాపోటీగా వేసేందుకు ఇప్పటినుంచే ముహూర్తాలు చూపించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి క్రాంతికిరణ్‌ వేలాది మందితో ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేయగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాత్రం కేవలం ఐదుగురితో కలిసి వచ్చి నామినేషన్‌ సమరి్పంచారు. ఈసారి కూడా హంగామాతో నామినేషన్‌ వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నియోజవర్గంలో మొత్తం 2.25,714 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 1,13,646.. పురుషులు 1,12,68  మంది ఓటర్లు ఉన్నారు.   

మరిన్ని వార్తలు