సీఎం షిండేకు షాకిచ్చిన శివసేన ఎంపీ.. మహారాష్ట్రలో మరో ట్విస్ట్‌

30 Oct, 2023 09:15 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గం శివసేన ఎంపీ హేమంత్‌ పాటిల్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలినట్టు అయ్యింది. 

వివరాల ప్రకారం.. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా ఎంపీ హేమంత్ పాటిల్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు పాటిల్‌ తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌‌తో పోఫలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో నిరసన తెలుపుతున్న వారిని కలుసుకొని హేమంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారి ఉద్యమానికి హేమంత్‌ పాటిల్‌ మద్దతు ప్రకటించారు. అనంతరం.. అక్కడికక్కడే తన రాజీనామా లేఖను స్పీకర్ ఓంబిర్లాకు పంపించారు. కాగా, లేఖలో మరాఠా రిజర్వేషన్ అంశం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. దీనిపై మరాఠా సమాజంలో భావోద్వేగాలు నెలకొన్నాయని పాటిల్‌ ప్రస్తావించారు. 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని హింగోలి లోక్‌సభ నియోజకవర్గానికి హేమంత్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఓబీసీ కేటగిరి కింద విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరాఠా కమ్యూనిటీ కొద్దికాలంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తోంది. కోటా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ, రెండో విడత నిరవధిక నిరాహార దీక్షను అక్టోబర్ 25న ప్రారంభించడంతో మరాఠా ఉద్యమ ఆందోళన ఊపందుకోనుంది. మరోవైపు.. మరాఠా రిజర్వేషన్లపై షిండే ప్రభుత్వం స్పందిస్తూ.. లీగల్ స్క్రూటినీకి లోబడి రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: 'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?'

మరిన్ని వార్తలు