డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయం

13 Oct, 2023 02:05 IST|Sakshi
గురువారం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గాజర్ల అశోక్‌

ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారెంటీలపై సంతకం పెడతాం

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ధీమా

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం ఖాయమని, డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు.

పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్‌ కమతం శ్రీనివాస్‌ రెడ్డి, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్‌ రెడ్డి, మానకొండూర్‌ నియోజకవర్గానికి చెందిన ఇల్లంతకుంట, మానకొండూర్‌ ఎంపీపీలు, ఇతర నేతలు గాంధీభవన్‌లో రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్‌ తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు.

డీజీపీని తొలగించాలని డిమాండ్‌
కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వేధించిన అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ప్రభాకర్‌ రావు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై, కాంగ్రెస్‌ నాయకుల ఫోన్‌ లపై నిఘా పెట్టారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీకు సాయం చేస్తున్న 75 మంది జాబితాను కేటీఆర్‌  తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఇచ్చారని, కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారని నిందించారు. అర్వింద్‌ కుమార్, జయేశ్‌ రంజన్, సోమేశ్‌ కుమార్‌ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా మోదీ, కిషన్‌ రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన గాజర్ల అశోక్‌
సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ మాజీ నేత గాజర్ల అశోక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆయన  గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నా రు.

ఉద్యమపంథా వీడి సాధారణ జనజీవనం గడుపుతున్న అశోక్‌ ప్రజలకు తనవంతు సేవ చేసేందుకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న దానిపై కొంతకాలంగా సన్నిహితులు, అభిమా నులతో చర్చలు జరుపుతున్నారు. అందరి అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అశోక్‌ చేరిక అటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ పరకాల అసెంబ్లీ టికెట్‌ అశోక్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు