చంద్రబాబు నాన్‌రెసిడెన్షియల్‌ నేత

25 Nov, 2020 03:57 IST|Sakshi

ఆయనకు అభివృద్ధికన్నా కమీషన్‌ ముఖ్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

తిరుపతి అర్బన్‌: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాన్‌ రెసిడెన్షియల్‌ నేతగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. మంగళవారం రాత్రి తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుందని కేంద్రం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు అత్యుత్సాహంతో అమరావతికి బలవంతంగా రాజధానిని తరలించారని దుయ్యబట్టారు. అధికారం పోయిన తర్వాత రాష్ట్రాన్ని వదలిపెట్టి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు చిన్న చిన్న మొత్తాలకు సంబంధించిన పనులు అప్పగిస్తే కమీషన్‌ రాదని కేంద్రం నుంచి ఆయన హయాంలో పెద్ద మొత్తాలను తెచ్చుకునే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. 

జనసేనతో కలిసే పోటీ
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి తాము పోటీ చేస్తామని అంతకు ముందు నిర్వహించిన తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో సోము వీర్రాజు తెలిపారు. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన తరహాలోనే తిరుపతి పార్లమెంట్‌ స్థానంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. అందరితో చర్చించి అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు