ఇలాంటివి రాసే బాబుకు 23 ఇచ్చారు: సోము

16 Nov, 2020 12:50 IST|Sakshi

రాధాకృష్ణపై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు

సాక్షి, విజయవాడ : ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు భాషకు అనుగుణంగా రాతలు రాయాలనే తప్ప, పోలవరం ప్రాజెక్టుపై రాధాకృష్ణకు ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘భద్రాచలం సహా 10 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తాయని అన్నారు. ముంపు మండలాల్ని కేసీఆర్‌ అడగరా? రాధాకృష్ణ పిచ్చిరాతలు రాస్తున్నారు. అలాగే పోలవరం ఎత్తులపై కూడా రాధాకృష్ణ తప్పుడు రాతలు రాస్తున్నారు. పోలవరాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌. కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేస్తుంది. అవగాహన లేని రాధాకృష్ణ.. అర్థరహిత రాతలు రాస్తున్నారు. ఈ ప్రభుత్వం లేనప్పుడు పోలవరంపై ఒక్క ముక్కైనా రాశారా? 

ఇప్పుడెందుకు ఈ రాతలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలు రాసే.. చంద్రబాబుకు 23 ఇచ్చారు. ఇంకా ఎన్ని తగ్గించాలనో వారి ప్రయత్నం. రాసుకోమనండి. పోలవరంలో అవినీతి చేసినవారిని కడిగిన ముత్యం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలవరంపై  చర్చకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలి. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వామపక్షాలు తెలుగుదేశనికి ఏజంట్లు. వాళ్లంతా చైనావోళ్లు. చైనావోళ్లు డబ్బులిస్తే వామపక్షాలు భారత్‌లో పనిచేస్తున్నాయి. చంద్రన్న డబ్బు ఇస్తే ఇక్కడ పని చేస్తున్నాయి. డబ్బులు తీసుకుని చిలక పలుకులు పలుకుతున్నారు’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు