పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలెందుకు?.. ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ

7 Sep, 2023 05:59 IST|Sakshi

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధానికి సోనియా గాంధీ లేఖ

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అజెండాను ప్రకటించకుండానే ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసారి సమావేశాల్లో మణిపూర్‌లో హింస, దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు తదితర కీలకాంశాలపై చర్చించాలని డిమాండ్‌చేస్తూ ప్రధాని మోదీకి సోనియా లేఖ రాశారు. ముఖ్యంగా తొమ్మిది అంశాలపై చర్చ జరగాల్సిందేనని ఆమె పట్టుబట్టారు.

‘ మణిపూర్‌లో హింస, పెరిగిన ధరవరలు, రాష్ట్రాలు– కేంద్రం మధ్య క్షీణిస్తున్న సత్సంబంధాలు, చైనాతో సరిహద్దు వెంట కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అదానీ గ్రూప్‌లో అవినీతి లావాదేవీల బహిర్గతం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలను చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘ ఇతర రాజకీయ      పారీ్టలతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. సమావేశాలు జరిగే ఈ మొత్తం ఐదు రోజులూ ప్రభుత్వ ఎజెండాపైనే చర్చ జరగనుందని మాకు సమాచారం వచ్చింది’ అని సోనియా వ్యాఖ్యానించారు.

ఇదో చక్కని అవకాశం
‘ఇదో చక్కని అవకాశం. ప్రజాసమస్యలు, ప్రాముఖ్యత దృష్ట్యా ఈసారి సమావేశాల్లో మేం తప్పకుండా పాల్గొంటాం. ఈ అంశాలపై చర్చకు సమయం కేటాయిస్తారనే భావిస్తున్నాను’ అని సోనియా అన్నారు. ‘ఉభయ సభల్లో ఏ అంశాలపై చర్చిస్తారో అనే విషయాన్ని ముందుగా తెలపకుండానే సెషన్‌ను ప్రారంభిస్తుండటం బహూశా ఇదే తొలిసారి అనుకుంటా’ అని కాంగ్రెస్‌ మరో నేత జైరామ్‌ రమేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర రాజకీయ పారీ్టలు చేస్తున్న డిమాండ్లకు తగ్గట్లు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని సోనియా కోరారు.

ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు సృష్టించిన విలయం, మరి కొన్ని రాష్ట్రాల్లో కరువు కాటకాలు వంటి ఘటనలను చర్చించాలని సోనియా డిమాండ్‌చేశారు. ‘పెరుగుతున్న నిరుద్యోగిత, సమాజంలో అసమానతలు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమస్యల వలయంలో చిక్కుకోవడం వంటి అంశాలనూ చర్చించాలి. రైతుల డిమాండ్‌ మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతాంగం సమస్యలు చర్చకు రావాలి’ అని సోనియా అన్నారు. ‘ఈసారి సమావేశాలను మేం బాయ్‌కాట్‌ చేయబోం. సభలోనే ఉండి సమస్యలపై పోరాడతాం’ అని ఢిల్లీలో మీడియా సమావేశంలో జైరాం రమేశ్‌ చెప్పారు.  
 
ఆ తొమ్మిది అంశాలు
1. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితితో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎస్‌ఎంఈలపై దుస్థితి
2. రైతులు, రైతు సంస్థలు లేవనెత్తిన కనీస మద్దతు ధర అంశంతో పాటు వారు లేవనెత్తిన ఇతర డిమాండ్‌ల పరిస్కారం కోసం మోదీ సర్కార్‌ చూపే నిబద్ధత
3.అదానీ వ్యాపార సమూహం లావాదేవీలను దర్యాప్తు చేయడానికి జేపీసీ ఏర్పాటు
4.మణిపూర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న నిరంతర వేదన, రాజ్యాంగ వ్యవస్థల విచి్ఛన్నం, అక్కడ నెలకొల్పాల్సిన సామాజిక సామరస్యం
5.హరియాణా వంటి వివిధ రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం
6.భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మన సరిహద్దుల్లో దేశ సార్వ¿ౌమాధికారానికి ఎదురైన సవాళ్లు
7.దేశవ్యాప్తంగా కుల గణన
8.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు
9.ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో కరువు కారణంగా పెరిగిన కష్టాలు 

మరిన్ని వార్తలు