English

Congress Success Reasons In TS Elections 2023: తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపున‌కు టాప్‌-10 కార‌ణాలు ఇవే..

3 Dec, 2023 16:52 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు దిశ‌గా ముందుకు సాగుతోంది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు చేరువవుతోంది. మ్యాజిక్ ఫిగర్(60) దాటి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.  ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ విజయానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..
1. ఎన్నిక‌లు ముందు  తెలంగాణ‌లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ బాగా పని చేసింది. 

2. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు 6 నెల‌ల ముందు నుంచే ఆ పార్టీ గ్రౌండ్ ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్టి.. దీని కార్యాచ‌ర‌ణ ప‌క్కాగా అమలు చేసింది.

3. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సంప్రాదాయక ఓటు బ్యాంక్‌ను తమవైపునకు తిప్పుకోగలిగింది.

4. తెలంగాణలో మైనార్టీల ఓట్లు కూడా కీలకం. మైనార్టీ డిక్లరేషన్ ద్వారా ఆ వర్గాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం ఒక్కేటే అన్న చర్చను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ల‌డంతో కాంగ్రెస్ స‌క్సెస్ అయింది.

5. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థులను బీఆర్ఎస్ మార్చకపోవటంతో కాంగ్రెస్ కు మరింత కలిసివచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయ‌కత్వం కూడా కాంగ్రెస్ గెలుపుకు ఒక ఆయుధంగా మారింది.

6. ఇక కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ తమ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చటం కూడా కాంగ్రెస్ కు కాస్త అనుకూలంగా మారిందని చెప్పొచ్చు. బండి సంజయ్ మార్పును కూడా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగా తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ గట్టిగా చెప్పగలిగింది. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసింది.

7. అలాగే బీఆర్ఎస్‌ ఐదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు, కొత్త పించన్లు మంజూరు చేయకపోవడాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది. అలాగే ధ‌ర‌ణి వెబ్‌సైట్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న‌ తీవ్ర వ్య‌తిరేక‌త కూడా బీఆర్ఎస్ ఓట‌మి కార‌ణం అయింది. 

8. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుంది కాంగ్రెస్. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదని.. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేని ఊళ్లు వేలాదిగా ఉన్నాయనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది కాంగ్రెస్.

9. దళిత బంధు, బీసీ బంధు పథకాల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోని నేతలందరూ సమైక్యరాగం వినిపించటమే కాదు.. కలిసి ముందుకు నడిచారు. అలాగే అగ్రనేతల వరుస సభలు, పర్యటనలు కూడా కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ ను పెంచింది.

10. ఇక తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిరుద్యోగులు త‌మ‌ను దారుణంగా మోసం చేసింద‌ని భావించారు. నిరుద్యోగులల్లో ఉన్న వ్య‌తిరేక‌త కూడా టీఆర్ఎస్ ఓడిపోవ‌డానికి ప్ర‌ధానం కార‌ణం అయింది.

మరిన్ని వార్తలు