డిజిటల్‌ లావాదేవీలు, నగదుపై నిఘా, లిమిట్‌ దాటితే..!

14 Oct, 2023 11:49 IST|Sakshi

డిజిటల్‌ నగదు బదిలీలపై పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం

ఆర్‌బీఐ, బ్యాంకర్లతో పోలీసు శాఖ సమావేశం  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో నగదు సరఫరా, పంపిణీపై రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అక్రమ నగదు రవాణా, పంపిణీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ వేదికగా జరిపే డిజిటల్‌ నగదు బదిలీలపై కూడా పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంకర్లతో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే రూ.కోట్లలో నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండిని పోలీసులు స్వాదీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్, యూపీఐ, ఇతర డిజిటల్‌ లావాదేవీలను ట్రాక్‌ చేయడానికి బ్యాంకర్లు ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంకర్ల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. అనుమానాస్పద బల్క్‌ లావాదేవీలపై పర్యవేక్షించేందుకు బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని, ఒక బ్యాంకు ఖాతా నుంచి వివిధ అకౌంట్లకు లావాదేవీలు జరిపితే, వాటిని గుర్తించి వెంటనే పోలీసు శాఖను అప్రమత్తం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లినా, యూపీఐ ద్వారా ఎక్కువ మందికి డబ్బు పంపితే సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు సూచించారు.

రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆన్‌లైన్‌ లావాదేవీల వివరాలు బ్యాంకుల నుంచి సేకరిస్తారు. ఆస్పత్రులు, భూ క్రయవిక్రయాలు, వివాహాలకు సంబంధించి నగదు, బంగారం తీసుకెళితే సంబంధిత ఆధారాలు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు