వెంగళరావు తర్వాత మళ్లీ నేనే: భట్టి

10 Nov, 2023 06:25 IST|Sakshi

ఖమ్మం జిల్లాకు మరో చాన్స్‌ రానుందని వ్యాఖ్య

మధిర/సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ మధిర అభ్యర్థి గా గురువారం ఆయన నామినేషన్‌ సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ నెల రోజుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మధిర దశదిశ నిర్దేశించేదిగా ఉండాలని అన్నారు.

ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అనేక పరిశ్రమలు జిల్లాకు సాధించారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి అవకాశం జిల్లాకు రానున్నందున అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంగళరావుకు మాత్రమే సీఎల్పీ నేతగా అవకాశం లభించగా, మళ్లీ ప్రజల ఆశీస్సులతో తాను ఆ పదవి చేపట్టానని చెప్పారు.

రాష్ట్ర సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడిన దోపిడీదారుడు, దుర్మార్గుడైన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణకు మెరుగైన భవిష్యత్‌ ఉంటుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో ప్రజల అసంతృప్తి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా చేశారు. వంద మంది కౌరవుల మాదిరి, శాసనసభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో.. పాండువుల్లా ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పోరాడానని భట్టి తెలపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అవినాశ్‌ వజహర్‌ ఇతర నేతలు పాల్గొన్నారు.  

బీఆర్‌ఎస్‌ చెప్తుంటే బీజేపీ ఐటీ దాడులు..
కాంగ్రెస్‌ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల ఇళ్లపై ఐటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం సరైంది కాదని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై కాంగ్రెస్‌ అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతున్నాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ చెపుతుంటే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని, ఐటీ దాడులతో కాంగ్రెస్‌ అభ్యర్థులను భయపెట్టాలని చూడటం అవివేకమేనని భట్టి అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వార్తలు