రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు

1 Oct, 2021 01:25 IST|Sakshi
హుజూరాబాద్‌ మండలంలోని సిర్సపల్లిలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌ 

ఎన్నికలప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారు  

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌  

హుజూరాబాద్‌/వీణవంక: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. గురువారం ఆయన హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన తనమీదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. దొంగ లేఖలు సృష్టించారని అన్నారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని తాను మరోసారి డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర కులాలు, మతాల్లో ఉన్న పేదలందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

‘దూప అయినప్పుడే బాయి తవ్వుకునే వాడివి నువ్వు కేసీఆర్‌.. ఎన్నికలప్పుడే నీకు ప్రజలు, అంబేడ్కర్‌ గుర్తుకు వస్తారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నెలలుగా హుజూరాబాద్‌ తప్ప ఇంకేమీ పట్టించుకోవడం లేదని.. వరదల గురించి అసలు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ప్రగతి భవన్‌లో కూర్చొని ప్రజల కోసం పనిచేయకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, ఆయన బిడ్డ, కొడుకు కూలి పనిచేసి, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించలేదని, వారి అక్రమ సంపాదన తీసుకొని తనకే ఓటు వే యాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగె శోభ పాల్గొన్నారు. అబద్ధపు లేఖ సృష్టించిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈటల ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు