గద్వాల ఎమ్మెల్యే DK అరుణ.! హైకోర్టు ఆదేశం

25 Aug, 2023 02:06 IST|Sakshi

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం కేసులో హైకోర్టు తీర్పు 

2018 డిసెంబర్‌ 12 నుంచి డీకే అరుణనే ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశం 

దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని కృష్ణమోహన్‌రెడ్డి ప్రకటన 

ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న  బీఆర్‌ఎస్‌కు ఇది చెంపపెట్టు: డీకే అరుణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో శాసనసభ్యుడి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను 2018 డిసెంబర్‌ 12 నుంచీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్‌ సమర్పించిన కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2,50,000 జరిమానా విధించింది. మరో రూ.50,000ను పిటిషనర్‌కు పరిహారంగా చెల్లించాలని సూచించింది. 

డీకే అరుణ పిటిషన్‌తో.. 
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యరి్థగా డీకే అరుణ పోటీ చేశారు. ఇందులో కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.

అయితే ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌ తప్పుల తడకగా ఉందని.. ఆయన ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తరఫున న్యాయవాది యోగి­తా ప్రకాశ్‌ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌కుమార్‌ గురువారం తీర్పు వెలువరించారు. 

భూములు, ఖాతాల వివరాలు చెప్పలేదని.. 
అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపిస్తూ.. కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య పేరుతో ఉన్న వాహనాలకు ట్రాఫిక్‌ చలానాలు ఉన్నా చెల్లించలేదని, ఈ వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన లేదని కోర్టుకు వివరించారు. గద్వాల ఎస్‌బీఐ, ఏడీబీ బ్యాంకుల్లో కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య జ్యోతికి ఉన్న ఖాతాల వివరాలను చెప్పలేదన్నారు.

సిబిల్‌ వివరాల ప్రకారం ఎమ్మెల్యే బ్యాంకులకు రూ.1,09,67,737 రుణాలు బకాయిలు ఉన్నా వెల్లడించలేదని, అలాగే జాతీయ బ్యాంకుల్లో మరో రూ.1.22 కోట్ల రుణాలున్నా పేర్కొనలేదని వివరించారు. అదే విధంగా పుద్దూరులో వారికి ఉన్న 24 ఎకరాల భూమిని అఫిడవిట్‌లో చూపలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు.

పత్రికా ప్రకటన ఇచ్చినా స్పందించలేదు. దీంతో న్యాయమూర్తి తీర్పును జూన్‌ 22న తీర్పును రిజర్వు చేసి గురువారం వెల్లడించారు. అయితే ఈ కేసులో కృష్ణమోహన్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆగస్టు 18న న్యాయవాది మనోహర్‌ వచ్చారని, ఈ మేరకు అప్లికేషన్‌ దాఖలు చేశారని రిజిస్ట్రీ హైకోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. జూన్‌ 22నే తీర్పు రిజర్వు చేశామని, ఈ నేపథ్యంలో మధ్యంతర అప్లికేషన్‌ను అనుమతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 
తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు వెలువరించిందన్నారు.

తన రాజకీయ ప్రత్యర్థులు నాలుగు అభియోగాలతో కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, కొందరికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను గత ఎన్నికల్లో 37వేల మెజారీ్టతో గెలిచానని, ఈసారి 50వేల మెజారీ్టతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

ఇప్పటికైనా న్యాయం జరిగింది: డీకే అరుణ 
తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ, అభ్యర్థులకు ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఈ తీర్పు మూడేళ్ల ముందే రావాల్సిందని.. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పును గద్వాల ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే దానికి ఇది సంకేతమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు