కొనాల్సినవారే పోటీలు పడి ధర్నాలా? 

13 Nov, 2021 03:43 IST|Sakshi

బీజేపీ, టీఆర్‌ఎస్‌పై సీఎల్పీ నేత భట్టి ధ్వజం  

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనాల్సిన, కొనిపించాల్సిన పార్టీలు పోటీలు పడి రోడ్లపై ధర్నాలు చేస్తుంటే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని అమెరికా, పాకిస్తాన్‌ వాళ్లు కొంటారా అని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. పరిపాలన చేతకాకనే అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రం లో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రోడ్లెక్కాయని విమర్శించారు.

శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం మీరు కొనాలంటే మీరు కొనాలంటూ నిస్సిగ్గుగా రోడ్డెక్కిన ఈ రెండు పార్టీలు రైతుల ప్రయోజనాలను గాలికొదిలి రాజకీయ కార్యకలాపాలకు పరిమితమయ్యాయని ఎద్దేవాచేశారు. జైజవాన్‌–జైకిసాన్‌అనే నినాదం మీద నడిచిన దేశంలో ఇప్పుడు జవాన్‌ లేడని, కిసాన్‌ని కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. వీరి వైఖరి కారణంగానే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి అప్పుల దేశంగా, దివాలాకోరు రాష్ట్రంగా మారాయని ఆరోపించారు.

సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన రెండు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తూ రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీలు ధర్నాలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేశారని, ఈ రెండు పార్టీల నిర్వాకంతో దేశం 50 ఏళ్లు వెనక్కు పోయిందని భట్టి వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు