ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం.. పావులు కదుపుతున్న పార్టీలు!

23 Feb, 2023 17:47 IST|Sakshi

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 21 నామినేషన్లు

శుక్రవారం నామినేషన్ల పరిశీలన

ఈ నెల 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు…

ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగం...

మార్చి 13న ఎన్నికల పోలింగ్.. మార్చి 16న ఫలితాల ప్రకటన

తెరవెనక రాజకీయ పార్టీల మద్దతు

హైదరాబాద్‌: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల  ఘట్టం ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు తెర వెనక రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.  

హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పీఆర్టియు టీఎస్ నేత జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి పీఆర్టియు టీఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని... ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకుడు చెన్నకేశవరెడ్డిని బరిలోకి దించారు. చెన్నకేశవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

ప్రభుత్వ మద్దతు తమకే ఉందని పీఆర్టీయు నేతలు చెబుతున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డిని సొంత సంఘం మూడోసారి పోటీకి నో చెప్పడంతో... టీఎస్ పీఆర్టియు పేరుతో మళ్లీ పోటీ చేస్తున్నారు.   ఇక బీజేపీ అధికారికంగానే ప్రైవేటు విద్యా సంస్థల అధినేత ఏ.వెంకటనారాయణ రెడ్డి పేరును ప్రకటించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.  ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

మొత్తానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకోవడంతో ఆసక్తికరంగా మారాయి. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ను అన్ని రాజకీయ పక్షాలు సవాల్ గా స్వీకరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు