తగ్గేదేలే అంటున్న బీజేపీ.. తెలంగాణభవన్‌ వద్ద హైటెన్షన్‌!

19 Nov, 2022 10:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొలిటికల్‌ నేతలు, కార్యకర్తల దాడులు, ఆరోపణలతో పాలిటిక్స్‌ వేడెక్కాయి. దీంతో, దాడి చేసిన వారిపై బంజారాహిల్స్‌ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. టీఆర్‌ఎస్‌ నేత మన్నె గోవర్ధన్‌ రెడ్డితో పాటు మరో 8 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

కాగా, బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ సిద్దమైంది. టీఆర్‌ఎస్‌ దాడిని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఆందోళనలు చేపట్టింది. టీఆర్‌ఎస్‌ దాడులను తిప్పికొట్టాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. కాగా, బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ భవన్‌ ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. 

మరోవైపు.. దాడి ఘటన అనంతరం ఎంపీ అరవింద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. దాడి ఘటన గురించి ఆరా తీశారు. మరోవైపు.. తెలంగాణలో పలుచోట్లు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కవిత డౌన్‌ డౌన్‌ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్లకార్డులను మంటల్లో కాల్చివేశారు. 
 

మరిన్ని వార్తలు