రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు

10 Jan, 2024 04:37 IST|Sakshi

తానే పోటీ చేస్తా అంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

పెద్దల ఆశీస్సులు తనకే అంటున్న జనసేన నేత కందుల దుర్గేష్‌

విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ ప్రకటనలు

సీటుపై ఎటూ తేల్చని చంద్రబాబుపై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు

సాక్షి, రాజమహేంద్రవరం: చంద్ర­బాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్ర­వరం రూరల్‌ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చక­పోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్‌ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్‌ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మె­ల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్‌ పెట్టి ఖండించారు. 

ప్రెస్‌మీట్లు.. సిగపట్లు..
పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్‌ దక్కుతుందని కందుల దుర్గేష్‌ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు.

దుర్గేష్‌ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్‌ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. 

బుచ్చయ్యకు కష్టమేనా..
బుచ్చయ్య రూరల్‌ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్‌ అయిన తనను కాదని ఇత­రు­లను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు.

ఆయనకు రూరల్‌ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్‌ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచా­రం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్‌ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నా­­రు. 

బాబు వైఖరితోనే.. 
చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్‌ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు.

గుంటూరులో సిగపట్లు
♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్‌
♦  ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు
♦  కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా
♦  గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్‌ సీటు అంటున్న తెలుగుదేశం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తల­నొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్‌ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవ­ర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ­పడుతున్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండు­సార్లు ఓటమి చవిచూశారు.

నాదెండ్ల మనోహర్‌ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయా­లని నిర్ణయించుకు­న్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌­కళ్యాణ్‌ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కూడా మరో­సారి పోటీచేయా­లని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్‌ క్లియర్‌ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు.

నియోజకవర్గంలోనూ ఆయన పర్యటి­స్తు­న్నారు. రెండురోజుల క్రితం పాద­యాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు..
ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్‌ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్‌ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్ని­కల్లో పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసిన బోనబో­యిన శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ సీటు కోసం పట్టుపడుతు­న్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు.

మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగు­దేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటి­వరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్‌ఆర్‌ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega