గుంతకల్లులో బడుగు, బలహీనవర్గాల విజయ యాత్ర  | Sakshi
Sakshi News home page

గుంతకల్లులో బడుగు, బలహీనవర్గాల విజయ యాత్ర 

Published Wed, Jan 10 2024 4:39 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra  in Anantapur District - Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో బడుగు, బలహీన వర్గాల ప్రజలు విజయ యాత్ర చేశారు. వైఎస్సార్‌సీపీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండదండలతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించారు.

గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్ర పట్టణంలో పండగ వాతావరణాన్ని నింపింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజల సాధికార నినాదంతో గుంతకల్లు హోరెత్తింది. పట్టణ ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. యువత కేరింతలతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు యాత్రకు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రంలా కనిపించింది. సభ ఆద్యంతం ‘జై జగన్‌.. జైజై జగన్‌’,  ‘గిరగరా తిరగాలి ఫ్యాన్‌’ అంటూ నేతలతో కలిసి నినాదాలు చేశారు. 

అణగారినవర్గాల కోసం పాటుపడుతున్న సీఎం జగన్‌ : ఎంపీ సురేష్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధించి, తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం జగన్‌ చేసిన మేలు వల్లేనని అన్నారు. సంక్షేమంలో, అన్ని పదవుల్లో అగ్రస్థానం ఈ వర్గాలకే కేటాయించారని తెలిపారు.

అణగారిన వర్గాలను అభివృద్ధి చేసి, సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్‌ ఆదర్శనీయుడని, ఈరోజు దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తోందని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదని అన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే మరోమారు నట్టేట ముంచుతారని, ఆయన్ని నమ్మవద్దని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించి, మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

ఇది విజయ యాత్ర: ఎల్రక్టానిక్‌ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ 
నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రాష్ట్రం­లో విజయయాత్ర చేస్తున్నారని, ఇదంతా సీఎం వైఎస్‌ జగన్‌ చలవేనని ప్రభుత్వ ఎల్రక్టానిక్‌ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ చెప్పారు. మనల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి న సీఎం వైఎస్‌ జగన్‌కు మనం ఇచ్చే గిఫ్ట్‌ ‘వై నాట్‌ 175’ అని అన్నారు. గత ఎన్నికల్లో గుంతకల్లు ప్రజలు 50 వేల మెజార్టీతో వెంకటరామిరెడ్డిని గెలిపించారని, ఈసా­రి లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 
వైఎస్‌ జగన్‌ వెంటే నడుద్దాం: 

మాజీ మంత్రి ఎం. శంకరనారాయణ 
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సామాజిక న్యాయం సాధించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ చెప్పారు. మనందరినీ అభివృద్ధిలోకి తెచ్చి , సమాజంలో గౌరవ స్థానం కల్పిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే నడుద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారని చెప్పారు. అదే వర్గాలను సీఎం జగన్‌ ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నారని తెలిపారు.  

వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగింది: ఎంపీ తలారి రంగయ్య 
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చి న ప్రాధాన్యతతో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగిందని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ. 1,500 కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇంతటి మేలు చేసిన వైఎస్‌ జగన్‌ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు.

Advertisement
Advertisement