ఒక ఒరలో ఇమడని 'కొడవళ్లు'

1 Mar, 2021 05:16 IST|Sakshi

మళ్లీ టీడీపీ పంచన సీపీఐ.. సింగిల్‌గానే సీపీఎం 

ఐక్య పోరాటాల నినాదమే తప్ప ఐకమత్యపోరు లేదు  

బెజవాడ పురపోరులో కమ్యూనిస్టుల కదన కుతూహలం 

సాక్షి, అమరావతి: ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడలో నేడు ఆ పార్టీల పరిస్థితి.. శాసించే స్థాయి నుంచి పొత్తుల పేరుతో సీట్లు యాచించే స్థాయికి పడిపోయింది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.. అనేది విజయవాడ కమ్యూనిస్టులకు అతికినట్టు సరిపోతుంది. ఒకప్పుడు బెజవాడ అంటే కమ్యూనిస్టుల కంచుకోట. 1888లో ఏర్పడిన విజయవాడ పురపాలక సంఘం 1960లో స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఎదిగింది. 1981లో నగరపాలక సంస్థ (కార్పొరేషన్‌)గా ఆవిర్భవించింది. విజయవాడ నగర తొలి మేయర్‌ పదవి కమ్యూనిస్టుల ఖాతాలోనే చేరింది. 1981–83, 1995–2000 మధ్య సీపీఐకి చెందిన టి.వెంకటేశ్వరరావు (టీవీ) రెండుసార్లు విజయవాడ మేయర్‌గా పనిచేసి కమ్యూనిస్టుల సత్తా చాటారు.

అప్పట్లో నగరంలో పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రముఖపాత్ర వహించిన టీవీ అఖిల భారత మేయర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేయడం గమనార్హం. అనంతరం కూడా బెజవాడలో కమ్యూనిస్టులు పట్టు కొనసాగించే ప్రయత్నాలు సాగాయి. బెజవాడ నగరంపై పట్టుకోసం 2005 వరకు వామపక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎం మధ్య ఆధిపత్య పోరు పెద్ద ఎత్తున సాగింది. ఒకదశలో ఈ రెండు ప్రధాన పార్టీల నడుమ భౌతికదాడులు కూడా జరిగాయి. ట్రేడ్‌ యూనియన్‌ రంగంలో పట్టున్నప్పటికీ కమ్యూనిస్టులు క్రమంగా ఎన్నికల బరిలో పట్టు కోల్పోతూ వచ్చారు. అనేక ఉద్యమాల్లో కలిసి పాల్గొనే ఈ రెండు రాజకీయ పారీ్టలు ఎన్నికల బరిలో మాత్రం ఐక్యంగా లేవు. 
43వ డివిజన్‌లో తెలుగుదేశం వారితో కలిసి ప్రచారం చేస్తున్న సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు 

బెజవాడ పురపోరులో లెఫ్ట్‌ రైట్‌ 
పోరాటాల సమయంలోను, ఆయా పార్టీల మహాసభల్లోను ఐక్య ఉద్యమాలు నిర్మించాలని, రెండు పార్టీలు కలిసి సాగాలనే తీర్మానాలు చేస్తుంటారు. కానీ తమది లెఫ్ట్‌.. రైట్‌.. అనే తీరుతో ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తుంటారు. తాజాగా జరుగుతున్న బెజవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పరిస్థితి ఇలానే ఉంది. 2019 ఎన్నికల వరకు టీడీపీపై దుమ్మెత్తిపోసిన సీపీఐ ఇప్పుడు బెజవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా 64 డివిజన్లలో కేవలం ఆరు డివిజన్ల (సీట్లు)తో సరిపెట్టుకుంది.
22వ డివిజన్‌లో ప్రచారం చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ అభ్యర్థి చిన్నారావు  

ఈ ఆరు స్థానాల్లో టీడీపీ బలపరిచిన సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకప్పుడు నగర మేయర్‌ పదవి దక్కించుకున్న సీపీఐ ఇప్పుడు ఒక్క డివిజన్‌లో అయినా నెగ్గకపోతామా.. అనే ఆశతో పురపోరులోకి దిగింది. ఇక సీపీఎం పరిస్థితి కొంతమెరుగు అని చెప్పవచ్చు. నగర వాసుల సమస్యలపై పనిచేస్తూ కొంత పట్టు సాధించిన సీపీఎం ఎవరితోను పొత్తు లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తోంది. గత పాలకవర్గంలో ఒక కార్పొరేటర్‌తో సరిపెట్టుకున్న సీపీఎం ప్రస్తుత ఎన్నికల్లో 22 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టింది.   

మరిన్ని వార్తలు