TPCC: అధ్యక్షుడిగా కోమటిరెడ్డా? రేవంతా?

22 Jun, 2021 03:01 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడితోపాటు పలు కమిటీల జాబితా సోనియా చేతికి

అధికారిక ప్రకటనే తరువాయి!

అధ్యక్ష రేసులో ముందంజలో కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి

సీనియర్లందరికీ ప్రాతినిధ్యం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి నూతన సారథి ఎంపిక వ్యవహారం తుది అంకానికి చేరుకుంది. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు పలు కమి టీల జాబితా సోనియా గాంధీ చేతికి వెళ్లిందని, ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి అనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్య క్షులు, ప్రధాన కార్యదర్శులతో సహా నాలుగైదు ఇతర కమిటీలను కూడా ప్రకటించనున్నారని సమా చారం. సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు ఎదురు చూస్తున్న ప్రకటనకు రంగం సిద్ధమైందని, ఏ క్షణమైనా అధికారిక ఉత్తర్వులు రావొచ్చని గాంధీ భవన్‌ వర్గాలంటున్నాయి. 

ఆ ఇద్దరేనా..!
టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతల పేర్లు ప్రతిపాదనకు వచ్చినా తుది పరిశీలన కోసం ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లనే అధిష్టానం పరిగణనలోకి తీసుకుంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, మధుయాష్కీల పేర్లను చివరి వరకూ పరిశీలించినా పలు కారణాలతో వెనక్కు వెళ్లాయని, అనూహ్య పరిణామం జరిగితే తప్ప కోమటిరెడ్డి, రేవంత్‌లలో ఎవరో ఒకరు పీసీసీ అధ్యక్షుడు కావ డం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. 10 జన్‌పథ్‌ సమాచారం ప్రకారం.. అధ్యక్షుడితో పాటు ఆరు గురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను కూడా అధిష్టానం నియమించనుంది. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఇతర సామాజిక వర్గాలకు అవకాశం దక్కేలా ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్ల జాబితాలో దామోదర రాజ నర్సింహ, బలరాం నాయక్, కొండా సురేఖ, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ లేదా మహేశ్‌కుమార్‌ గౌడ్, జగ్గారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి తోడు మరో 30 మందికి పైగా నేతలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించనున్నారు.

కొన్ని కమిటీలు కూడా..
టీపీసీసీ కమిటీతోపాటు మరికొన్ని కమిటీల ఎంపిక కసరత్తును కూడా కాంగ్రెస్‌ అధిష్టానం పూర్తి చేసింది. ఇందులో ప్రచార, మేనిఫెస్టో, స్ట్రాటజీ, ఎన్నికల కమిటీలు ఉండనున్నాయి. ఈ కమిటీల్లో ఏదో ఒక దానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్‌ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న దానిపై అధిష్టానం గోప్యతను పాటిస్తోంది. రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇవ్వని నేపథ్యంలో ఆయన్ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నారు. రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇస్తే కోమటిరెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్‌ ఇస్తారా లేక మరో నేతను ఎంపిక చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మేనిఫెస్టో కమిటీకి కూడా సీనియర్‌ నేతలను నియమిస్తారని, ఇతర కమిటీలతో కలిపి పూర్తి స్థాయిలో సామాజిక కోణంలో కూర్పు జరుగుతుందని, సీనియర్లందరికీ తగిన ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలు తయారైనట్టు తెలుస్తోంది. ఈ కమిటీలకు సంబంధించిన జాబితాను పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కె.సి.వేణుగోపాల్‌ సోమవారం సోనియాకు అందజేశారని, ఒకట్రెండు రోజుల్లోనే ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన రానుందనే చర్చ జోరుగా సాగుతోంది.    

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు