కేసీఆర్‌ లక్ష్యం కేటీఆర్‌ను సీఎం చేయడమే!: అమిత్‌ షా

25 Nov, 2023 11:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌​: తెలంగాణ రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదని బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..  శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.  

మిగులు ఆదాయం ఉన్న ఈ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ పాలనలో దివాలా తీసింది. ఈ పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతికి యువత నోచుకోలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య గాలికి వదిలేశారు. ప్రతీ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్‌ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది.  సెప్టెంబర్‌ 17 నిర్వహణపై మాట ఇచ్చి తప్పారు.  స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.  తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు. 

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం.. ఈ మూడు ఒక్కటే. ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారు.. ఎన్నికలయ్యాక కలిసిపోతారు. కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలకు ఓటేసినట్లే. బీజేపీ పాలనలో అవినీతి ఉండదు. గత తొమ్మిదేళ్లలో బీజేపీ నెరవేర్చిన హామీలను చూడండి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది.  దేశంలో ఎక్కడా లేని విధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం.  మీ ఓటు మీ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం మాత్రమే కాదు.. భారత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించాలి అని తెలంగాణ ఓటర్లను అమిత్‌ షా కోరారు.

హలాల్‌ బ్యాన్‌పై నిషేధం తీసుకోలేదు
హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

కొల్లాపూర్‌లో మాట్లాడుతూ.. 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ ప్రచార సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు పరిహారం, భూమి ఇస్తాం. మాదిగ రిజర్వేషన్‌ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. బీజేపీ చెప్పిన ప్రకారం.. హమీలన్నీ నెరవేరుస్తాం.

కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. కేసీఆర్‌కు యువతపై ప్రేమ లేదు. ఆయన ప్రేమంతా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంపైనే. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే.. వాళ్లు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారు. ఇవాళ కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. వాళ్లు రేపు బీఆర్‌ఎస్‌లోకే వెళ్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వంలో పేపర్‌ లీకేజీ కారకులపై చర్యలు తీసుకుంటాం. 

మరిన్ని వార్తలు