ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్‌!

25 Nov, 2023 08:57 IST|Sakshi

రిటర్నింగ్ అధికారి అనుచిత వ్యాఖ్య చేశారన్న స్వతంత్ర మహిళాఅభ్యర్థి

కామారెడ్డిటౌన్‌: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్‌’అంటూ రిటర్నింగ్‌ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మాక్‌ పోలింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్‌ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్  అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.

ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్‌’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. 

మరిన్ని వార్తలు