మోదీ-కేసీఆర్‌ ఫెవికాల్‌ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి

25 Nov, 2023 12:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఓటుకు పదివేలు ఇచ్చి నగదు బదిలీ పథకం మొదలైందని,  ఈ ఓట్ల కొనుగోలు రాజకీయానికి బీజేపీ సహకారం అందిస్తోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతు బంధు నిధుల జమకు సీఈసీ అనుమతులు ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌-బీజేపీలపై తీవ్ర విమర్శలే గుప్పించారాయన. 

‘‘కేసీఆర్, మోదీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఇక్కడ ప్రధానంగా నేను మూడు అంశాలను ప్రస్తావిస్తున్నా. రైతు బంధు, వివేక్.. పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో 300 కోట్లను సీజ్ చేయకపోవడం.. కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేయడం. 

.. 2018లో జూన్ లో రైతు బంధు పథకం ప్రారంభించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారు. ఆనాడు ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆరెస్ కు సహకరించింది. 

.. అలా బీజేపీ బీఆర్‌ఎస్‌ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో.. రైతులకు నష్టం జరుగుతోంది. కౌలు రైతులు, రైతు కూలీలైతే పూర్తిగా నష్టపోతున్నారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చే రైతు బంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావొద్దు. రైతులు ఆందోళన చెందొద్దు. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి. కాంగ్రెస్ వచ్చాక.. మేం ఇవ్వాల్సింది మేం ఇస్తాం. 

.. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. 2018లాగే ఇప్పుడూ కేసీఆర్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుంది. 

.. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు. కానీ కాంగ్రెస్ లో చేరాక బీజేపీ కి ఆయన రావణాసురుడిగా కనిపించారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ఆయన్ని అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు బంధుత్వం కూడా బీఆరెస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోంది. సీనియర్‌ నేత ఆర్. సురేందర్ రెడ్డిపై ఇప్పటివరకు వేలెత్తి చూపిన వారు లేరు. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆరెస్  వారిని టార్గెట్ చేశారు. 

బీఆర్‌ఎస్‌ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతల ఫోన్స్ కూడా ఎత్తడం లేదు. ఈడీలు, ఇన్ కమ్ టాక్స్ లు కేవలం కాంగ్రెస్ పైనే పనిచేస్తాయా?. జరుగుతున్న పరిణామాలను తెలంగాణ సమాజం గమనించాలి. బీఆరెస్, బీజేపీ ప్రసంగాలకు , జరుగుతున్న తతంగాలకు పోలిక లేదు. కాంగ్రెస్ గెలుస్తుందనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో బీఆరెస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి అని తెలంగాణ ప్రజల్ని రేవంత్‌ కోరారు.

మరిన్ని వార్తలు