కాంగ్రెస్‌ వచ్చేది లేదు.. పోయేది లేదు: కేసీఆర్‌

24 Nov, 2023 13:58 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: ‘‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టా. 33 పార్టీలు తెలంగాణకు అండగా నిలిస్తే తెలంగాణ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ  తెలంగాణకు చేసింది ఏమీ లేదు’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఓటేసే ముందు ఎవరు అభివృద్ధిని చేశారో అనేది పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలను కోరారాయన. 

శుక్రవారం మధ్యాహ్నాం మంచిర్యాల నస్పూర్‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.  ‘‘తెలంగాణకు కాంగ్రెస్‌ ఏం చేయలేదు. గోదావరి పక్కనే పారతున్నా కాంగ్రెస్‌ హయాంలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.  కాంగ్రెస్‌ వల్లే 58 ఏళ్లు తెలంగాణ గోసపడింది. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని ఏడిపించారు’’ అని కేసీఆర్‌ విమర్శించారు.

తెలంగాణ ప్రజల కోసమే పుట్టింది బీఆర్‌ఎస్‌. మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నాం. రైతుబంధు తెచ్చిందే బీఆర్‌ఎస్‌. కానీ, అది దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రైతులకు 3గంటలు కరెంట్‌ చాలని అంటున్నారు.  అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్ర చూసి ఓటేయాలి. ఓటు మన నుదుటి రాత మారుస్తుంది’’ అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. 

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ వాళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపిస్తే.... ఎన్నికలయ్యాక బీఆర్ఎస్‌లో చేరుతామని ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారట.. కానీ అదంతా ఝూటా ముచ్చట (అబద్దం). తనను గెలిపిస్తే బీఆర్ఎస్‌లో చేరుతానని ఇక్కడ(మంచిర్యాల) నాయకుడు కూడా చెబుతున్నాడట.. నాకు వార్త వచ్చింది... కానీ అదేం లేదు అంతా అబద్దం. మీ వద్ద కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే మీ వాడకట్టుకో పేకాట క్లబ్ వస్తుంది. అప్పుడు మంచిర్యాల మొత్తం పేకాట క్లబ్బులు తయారవుతాయి. అప్పుడు ఇళ్లు అమ్ముకొని పేకాటలో పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. 

అయిదేళ్ల భవిష్యత్తు బాగుపడాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు ఉండేవి. 1969లో కాంగ్రెస్ నాలుగు వందల మంది ఉద్యమకారులను కాల్చి చంపింది. మలి దశ ఉద్యమంలో బీఆర్ఎస్‌ను చీల్చే ప్రయత్నం చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచుతాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతుబంధు కూడా పెంచుతాం. తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని కేసీఆర్‌ అన్నారు. 

సింగరేణిని లాభాల్లోకి తెచ్చాం
ఓటు ప్రజల తలరాతల్ని మారుస్తుందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో జరిగిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘డిసెంబర్ 3 నుండి అసలు దుకాణం ప్రారంభం అవుతుంది. తెలంగాణను, సింగరేణిని ముంచిందే కాంగ్రెస్. రూ.   600 కోట్ల మారిటోరియంలో ఉన్న సింగరేణిని రెండు వేల కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. సింగరేణి సంస్థలు విస్తరించి బయ్యారం ఉక్కు గనులను అప్పగిస్తాం. 

ప్రత్యేక తెలంగాణలో మేధావులతో చర్చించి సంక్షేమ పథకాలు అమలు చేశాం. ధరణిని తెచ్చిందే బీఆర్‌ఎస్‌. ధరణిని కాంగ్రెస్‌ తీసేస్తామంటోంది. ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా ఇస్తారు?. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగం ఆగం కావొద్దు.  అభ్యర్థి గుణగణాలు.. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలి.  ఓటు ప్రజల తలరాతలు మారుస్తుంది.

ఇంకా అభివృద్ధి చేసుకుందాం
ములుగు జిల్లా ములుగు కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ..  ‘‘తెలంగాణ వచ్చిన రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఉండేవి. సమ్మక్క సారలమ్మ జాతరకు ఒకప్పుడు ఆదరణ లేదు. కనీసం రోడ్డు కూడా సరిగా వేయలేదు. అధికారంలోకి వచ్చాక రోడ్డు వేసుకున్నాం. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన.. కాంగ్రెస్‌ యాభై ఏళ్ల పాలన బేరీజు వేసుకోవాలి.  ఎవరు అభివృద్ధి చేస్తారో గమనించి ఓటేయాలి.

రైతు బంధు పుట్టించిందే కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌. రైతు బంధు వృథా అని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. కాంగ్రెస్‌ యాభై ఏళ్లు దేశాన్ని, రాష్ట్రంను పాలించింది. కాంగ్రెస్‌ పాలనలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం. కానీ, కాంగ్రెస్‌ వాళ్లు 24 గంటలు వృథా.. 3 గంటలు చాలని అంటున్నాడు. కాంగ్రెస్‌ ఇచ్చిన పెన్షన్‌ రూ.200 రూపాయలు. మనం పెన్షన్‌ రూ.5 వేలకు పెంచుకుందాం. తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసుకుందాం’’ అని కేసీఆర్‌ అన్నారు.

సీతక్కపై విమర్శలు
ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఉద్దేశించి కేసీఆర్‌ విమర్శ చేశారు. ‘‘గత ఎన్నికల్లో మీరు(ములుగు ప్రజల్ని ఉద్దేశించి..) నన్ను(బీఆర్‌ఎస్‌) గెలిపించకున్నా నేను అలగలేదు. కానీ, ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా.. ముఖ్యమంత్రిని కలవాలి. కానీ, మీ ఎమ్మెల్యే(సీతక్క) ఎప్పుడూ మా దగ్గరకు రాలేదు’’ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తానంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటోందని.. కానీ, ఇందిరమ్మ రాజ్యంలో ఎన్‌కౌంటర్లు, ఎమర్జెన్సీలు ఉండేవని.. కాబట్టి కాంగ్రెస్‌ గెలిచేది లేదు.. పోయేది లేదు అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు