TS Elections 2023: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?

25 Aug, 2023 15:36 IST|Sakshi

10 ఎమ్మెల్యే టికెట్లు, రెండు ఎంపీ టికెట్లు కావాలి

బీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్, బీజేపీ అయినా ఇవ్వాలి

టికెట్ ప్రయత్నాల్లో ముమ్మరంగా కమ్మ నేతలు

తెలంగాణలో కమ్మ, వెలమల మధ్య అభిప్రాయ బేధాలు!

రాజకీయాల్లో కుల సమీకరణాల పాత్ర చాలా కీలకం. ఓటు బ్యాంకును నిర్ణయించేది, ఎన్నికల్లో గెలిపించేది కులమే అని నమ్ముతారు. తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు కమ్మ సామాజిక వర్గం విడుదల చేసిన ఓ ప్రెస్‌ నోట్‌ ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలపై చర్చకు దారి తీసింది. మొన్నటి బీఆర్‌ఎస్‌ టికెట్ల పంపిణీలో వెలమ అభ్యర్థులకు 11 టికెట్లు దక్కగా, కమ్మ సామాజిక వర్గానికి 5 టికెట్లు దక్కాయి. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న తాము, చాలా ప్రాంతాలతో పాటు ఇతర వర్గాలపైనా ప్రభావం చూపిస్తామని నమ్ముతున్న కమ్మలు తమకు 5 సీట్లు సరిపోవన్న అసంతృప్తిలో ఉన్నారు 

మాకు మీరు.. మీకు మేం

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. కెసిఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్‌, ఖమ్మంలో ఈ సామాజిక వర్గంకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు వీరు ప్రభావితం చేసే ఓట్లను గంపగుత్తగా బీఆర్‌ఎస్‌కు పడేవి. 

ఇటీవల సీఎం కెసిఆర్‌ ప్రకటించిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న కమ్మలు

జూబ్లీహిల్స్‌ - మాగంటి గోపినాథ్‌
శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ
సిర్పూర్‌ - కోనేరు కోనప్ప
ఖమ్మం - పువ్వాడ అజయ్‌కుమార్‌
మిర్యాలగూడ - నల్లమోతు భాస్కరరావు


(రేవంత్, మాణిక్కం ఠాగూర్ ను కలిసిన తర్వాత గాంధీభవన్ ముందు కమ్మ నేతలు)

తుమ్మల, జలగం ఇద్దరికీ షాక్

ఇప్పుడు ఆ సమీకరణాల్లో తేడా కొట్టిందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్‌లకే టికెట్లు వచ్చాయి. పైగా 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమైన కమ్మ నేతలకు టికెట్‌ ఈ సారి దక్కలేదు. పాలేరు నుంచి టికెట్‌ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురి కాగా..  పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఇవ్వాళ తుమ్మల కన్నీళ్లు పెడుతూ హైదరాబాద్ నుంచి వెళ్లే దృశ్యాలు ఈ సామాజిక వర్గంలో చర్చనీయాంశమయ్యాయి. 


(టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్న తుమ్మల)

కమ్మ @ కిం కర్తవ్యం 

ఈ పరిణామాలు కమ్మ వర్గంలో కొంత అసంతృప్తి నింపాయి. ఈ మేరకు తెలంగాణ కమ్మ వర్గం ముఖ్యనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఇక మిగిలింది కాంగ్రెస్‌, బీజేపీ కాబట్టి .. అర్జంట్‌గా రెండు లేఖలు తయారు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రకటించబోయే జాబితాలో  కమ్మలకు పది ఎమ్మెల్యే టికెట్లు, దీంతో పాటు వచ్చే ఏడాది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు అందించారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ను మాత్రం కలవలేదు. 


(బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కలిసి టికెట్లు ఇవ్వాలని కోరిన కమ్మ నేతలు)

చాలా స్ట్రాంగ్

తెలంగాణలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా మాత్రం వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు కులాలకు 
హైదరాబాద్‌లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి మిగిలింది. ఓ రకంగా బీఆర్‌ఎస్‌ను రెచ్చగొట్టడానికే కమ్మ నాయకులు కాంగ్రెస్‌, బీజేపీలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు