బీబీనగర్‌ ఎయిమ్స్‌పై ఎందుకింత నిర్లక్ష్యం?

24 Dec, 2022 01:35 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంపీ ఉత్తమ్‌ ఆగ్రహం

బీజేపీది ఉద్దేశపూర్వక జాప్యమంటూ విమర్శ

కేంద్రమంత్రి సమాధానంపై మండిపాటు

సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్‌ ఎయిమ్స్‌ని పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తీవ్ర జాప్యం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎయిమ్స్‌ను పూర్తి చేసేలా అవసరమైన నిధులు ఇవ్వక, పోస్టులను భర్తీ చేయక కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్రం సైతం విఫలమవుతోందని నిందించారు.

శుక్రవారం లోక్‌సభలో బీబీనగర్‌ ఎయిమ్స్‌పై ఉత్తమ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమాధాన మిచ్చారు. ఎయిమ్స్‌ నిర్మాణపనులు పురోగతిలో ఉన్నాయని తెలిపిన కేంద్ర మంత్రి, వాటి పూర్తికి నిర్ణీత గడువుపై మాత్రం దాటవేశారు. మొత్తం రూ.1,028 కోట్లు నిధులు కేటాయించగా, ఇందులో రూ.31.71 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

కేంద్రమంత్రి సమాధానాన్ని ఖండిస్తూ ఉత్తమ్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘బీబీనగర్‌కు 2018 డిసెంబర్‌ 17న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటివరకు కేవలం రూ. 31.71కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2022లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఆ గడువును 2025వరకు పొడగించారు. ఇప్పుడేమో గడువు పూర్తిపై కేంద్రం మౌనంగా ఉంది’ అని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. ఎయిమ్స్‌కి 183 ఫ్యాకల్టీ పోస్టులుంటే 94 ఖాళీగా ఉండగా, 971బోధనేతర పోస్టుల్లో 784 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు