‘మాయ’మైనట్టేనా?

11 Mar, 2022 03:37 IST|Sakshi

కొడిగట్టిన మాయావతి ప్రాభవం

ఒక్క స్థానంతో బీఎస్పీ కుదేలు

బీజేపీ వైపు మొగ్గిన ఎస్సీలు

సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాయావతి సారథ్యంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఆ పార్టీ కుదేలైంది. తొలినుంచి ఆయువుపట్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆదరించకపోగా మాయా సొంత సామాజికవర్గం జాటవ్‌లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. ఒక దశలో ప్రధాని అయ్యేంతగా వెలుగు వెలిగిన మాయావతి ప్రభ ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులంటున్నారు.

మాయా లేదు..మంత్రం లేదు..
బహుజనుల నేతగా 1995, 1997, 2002, 2007ల్లో నాలుగుసార్లు యూపీ సీఎం పీఠమెక్కిన ఘన చరిత్ర 66 ఏళ్ల మాయావతిది. అలాంటిది బీఎస్పీ ఈసారి ఎన్నడూ లేనంతటి ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు! ఓట్ల శాతం కూడా 12.6 శాతానికి దిగజారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ కేవలం 19.3 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలను మాయా పెద్దగా పట్టించుకోవడం లేదు.  దాంతో పార్టీలో క్రియాశీలంగా ఉండే బ్రాహ్మణవర్గం బీజేపీలోకి, ముస్లింలు సమాజ్‌వాదీలో చేరారు.  బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్‌ పోటాపోటీ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలకు దిగాయి. కాంగ్రెస్‌ నుంచి ప్రియాంకా గాంధీ 209 ర్యాలీలు, సభలు; బీజేపీ నుంచి యోగి 203 సభలు, ర్యాలీలు; ఎస్పీ అధినేత అఖిలేశ్‌ 139 ర్యాలీలు, సభలు జరిపితే మాయా కేవలం 18 మీటింగులతో ముగించారు.   

ఎస్సీలూ దూరమయ్యారు
యూపీలో 21 శాతమున్న దళిత ఓటర్లు తొలినుంచీ బీఎస్పీకే దన్నుగా నిలిచారు. సుమారు 4.2 కోట్ల దళితుల్లో 2.25 కోట్లు మాయా సామాజికవర్గం జాటవ్‌కే చెందిన వారు. పాసీలు 70 నుంచి 80 లక్షల దాకా (16 శాతం)ఉంటారు. కోటికి పైగా మిగతా కులాల వారున్నారు. రాష్ట్రంలోని 84 ఎస్సీ స్థానాల్లో 2007లో బీఎస్పీ ఏకంగా 61 గెలుచుకోగా 2012లో 14కు పడిపోయింది. 2017 ఎన్నికల నాటికి ఎస్సీలు దాదాపుగా బీజేపీ వైపు మొగ్గారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాటవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో దళితులు బీఎస్పీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అదే ఫార్ములా వాడింది. దాంతో దళితులంతా మరోసారి బీజేపీవైపే నిలిచారు.

గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన సీట్లు, ఓట్లు
ఎన్నికలు    గెలిచిన    ఓట్ల
    సీట్లు    శాతం
2002    98    23.06
2007    206    30.43
2012    80    25.97
2017    19    22.23
2022    1    12.66

మరిన్ని వార్తలు