Harish Rawat: గజ ఈతగాడు.. ఆయనను కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేదు..

22 Jan, 2022 06:07 IST|Sakshi

దేవుళ్లు నడయాడే భూమిగా పేరున్న  ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కు సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌. ఆయనను కాదనుకొని ఆ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. ఎన్నికలనే మహాసముద్రంలో ఈత కొట్టనివ్వకుండా హైకమాండ్‌ ప్రతినిధులు తన కాళ్లూ చేతులు కట్టేశారని,  ఇక విశ్రాంతి తీసుకుంటానని రావత్‌ ఎన్నికలకు ముందు అస్త్రసన్యాసం చేయడానికి సిద్ధపడినా,  ముఠా తగాదాలు తారాస్థాయికి చేరుకొని వలసలు ఎక్కువైనా రావత్‌ అనుభవాన్నే మళ్లీ కాంగ్రెస్‌ నమ్ముకుంది. ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి మళ్లీ ఉత్తరాఖండ్‌ పీఠంపై పాగా వేసే బృహత్తరమైన బాధ్యత ఆయన భుజస్కంధాలపైనే మోపింది. హై కమాండ్‌ నుంచి రాహుల్‌ గాంధీ అండదండలు, ముఖ్యమంత్రిగా 43% ప్రజల మద్దతు రావత్‌కే ఉందని వివిధ సర్వేలు తేల్చేయడంతో ఎలాంటి బంధనాలు లేకుండా ఈత కొట్టడానికి ఉత్సాహపడుతున్నారు.  
► ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని మొహనారి గ్రామంలో రాజ్‌పుత్‌ కుటుంబంలో 1948 సంవత్సరం ఏప్రిల్‌ 27న జన్మించారు.
► లక్నో యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుకున్నారు.  
► యువకుడిగా ఉండగానే రాజకీయాల పట్ల ఆకర్షితులై యువజన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చురుగ్గా ఉండే రేణుకను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  
► 1980లో తొలిసారిగా అల్మోరా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1980 – 1989 నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు
► 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  
► 2002 నుంచి ఆరేళ్ల పాటు
రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  
► 2009లో హరిద్వార్‌ నియోజకవర్గం నుంచి  లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009–14 మధ్య మన్మోహన్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.  
► 2013 నాటి వరద బీభత్స పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోలేకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో రావత్‌ 2014 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌ సీఎం అయ్యారు.  
► 2016లో ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రావత్‌కి వ్యతిరేకంగా తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రభుత్వం మైనారి టీలో పడిపోయింది
► కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టింది. అయితే మూడు నెలల్లోనే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకొని తిరిగి సీఎం అయ్యారు.  
► అదే సమయంలో సమాచార్‌ ప్లస్‌ అనే న్యూస్‌ చానెల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో హరీశ్‌ రావత్‌ 12 మంది ఎమ్మెల్యేలకు రూ.25 లక్షల చొప్పున ముడుపులు చెల్లించినట్టుగా ఆరోపణలు రావడం ఆయనను ఇరకాటంలో పడేసింది.  
► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌ రావత్‌ నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌ ఓటమిపాలైంది. హరిద్వార్‌ రూరల్, కిచ్చా స్థానాల్లోంచి పోటీ చేసిన రావత్‌ ఎక్కడా నెగ్గలేదు.  
► పంజాబ్‌  కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్, నవజోత్‌ సింగ్‌ సిద్ధూల మధ్య సఖ్యత కుదర్చడంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న రావత్‌ విఫలమైనందుకు ప్రచార కమిటీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది.  
► మరోవైపు ఉత్తరాఖండ్‌ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దేవేందర్‌ యాదవ్‌తో విభేదాలు రావత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దీంతో ఇక  చేసింది చాలంటూ ట్వీట్‌ చేసి రావత్‌ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంరేపారు. చివరికి రాహుల్‌గాంధీ జోక్యంతో ఎన్నికల ప్రచార కమిటీ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు.  
► అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చి ఏటికి ఎదురీదుతున్న బీజేపీని ఢీ కొట్టడానికి ఇప్పుడు రావత్‌ అనే బలమైన నాయకుడు ఉండాలనే కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. దానికనుగుణంగానే రావత్‌ ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు.  
 
 
 – నేషనల్‌ డెస్క్, సాక్షి
 

మరిన్ని వార్తలు