సీఎంను కలిసినా మౌనం వీడని ఎమ్మెల్యే చెన్నమనేని.. ఏం చర్చించారు?

30 Aug, 2023 08:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేల వేములవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి మరోసారి టికెట్‌ ఆశించి భంగపడిన చెన్నమేనని పంచాయితీ వారం రోజులుగా ఓ కొలిక్కి రావడం లేదు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం మాజీ ఎంపీ వినోద్ మధ్యవర్తిత్వంతో కేసీఆర్‌తో చెన్నమనేని భేటీ అయ్యారు. సీఎంను కలిసినా రమేష్‌ బాబు మౌనం వీడలేదు. చెన్నమనేనితో పాటు చల్మెడకూ ప్రగతీభవన్ పిలుపురాగా.. ఇద్దరి సమక్షంలో సీఎం మంతనాలు జరిపారు. అయితే భేటీకి సంబంధించి విషయాన్ని చెన్నమనేని, చల్మెడ వర్గీయులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో భేటీ సారాంశంపై ఉత్కంఠ నెలకొంది.
చదవండి: మైనంపల్లికి సన్‌స్ట్రోక్‌ తప్పదా? 

కాగా బీఆర్‌ఎస్‌ అధిష్టానం మేములవాడ టికెట్‌ చల్మెడ లక్ష్మీ నర్సింహరావుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంతో  చెన్నమనేని అలకబూనారు. అప్పటి నుంచి అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్‌ రావు కలుస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారు పదవి ప్రకటించినా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబులో జ్వాలలు ఆరడం లేదు. 

ఇప్పటికే వేములవాడ బీఆర్ఎస్‌లో రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గతంగా ప్రతిష్ఠంభన నెలకొంది. చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. అంతేగాక రమేష్ బాబు సలహాదారు పదవిపైనా ఇప్పటివరకూ అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదు. గులాబీ బాస్‌తో భేటీ తర్వాతైనా వేములవాడ బీఆర్ఎస్ అంతర్గత కలహాలకు చెక్ పడుతుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. శుక్రవారం తన తండ్రి శత జయంతి ఉత్సవాలకు రమేష్ బాబు వేములవాడ రానున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ బాబు ఏం చెప్పబోతున్నారనే దానిపై ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు