నిజం మాట్లాడే సొంత నేతలనూ బహిష్కరిస్తుంది

23 Nov, 2023 06:05 IST|Sakshi

రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు 

జైపూర్‌: రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారసభల్లో అధికార కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరింతగా విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్వాడా జిల్లాలోని కోట్రీ గ్రామంలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘ కాంగ్రెస్‌ కుటుంబం ముందు ఎవరైనా నిజం మాట్లాడితే ఇక అంతే. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బహిష్కరిస్తారు.

ఒకప్పుడు రాజేశ్‌ పైలట్‌ ఆహార సమస్యపై కాంగ్రెస్‌ కుటుంబాన్నే సవాల్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి రాజేశ్‌ పైలటే కాదు ప్రస్తుతం ఆయన కుమారుడు సచిన్‌ పైలట్‌ సైతం పార్టీ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 1997లో పార్టీ అధ్యక్ష పదవికి సీతారాం కేసరికి పోటీగా ఎన్నికల్లో నిల్చున్నందుకు రాజేశ్‌ పైలట్‌పై పార్టీ కన్నెర్రజేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం అశోక్‌ గెహ్లోత్‌తో పోటీపడినా అధిష్టానం దీవెనలు సచిన్‌కు దక్కలేదు’’ అన్నారు.

అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు క్లీన్‌ చిట్‌
‘‘అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు రాష్ట్ర మంత్రులే క్లీన్‌చిట్‌ ఇస్తున్నారు. ఇలాంటి పాలనలో మన తల్లులు, కూతుళ్లు, అక్కాచెల్లెళ్లకు రక్షణ ఏది? ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఏ ఒక్క అవకాశాన్నీ కాంగ్రెస్‌ వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనకు ముగింపు పలకాల్సిన సమయమొచ్చింది. కమలానికి మీరు వేసే ఒక్కో ఓటు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేందుకు దోహదపడుతుంది’’ అని మోదీ అన్నారు. అంతకుముందు దుంగార్‌పూర్‌ జిల్లాలోని సాగ్వారా పట్టణంలో ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీతో పాటు సచిన్‌ పైలట్‌ కూడా ఖండించారు. ఆయన సొంత పార్టీపై దృష్టి పెడితే మంచిదని సచిన్‌ సూచించారు.

మరిన్ని వార్తలు