ప్రాంతీయ సంక్షోభంగా మారొద్దు: మోదీ

23 Nov, 2023 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరు ప్రాంతీయ సంక్షోభంగా రూపుదాల్చకుండా అడ్డుకోవాలని ప్రధాని మోదీ జీ20 దేశాధినేతలకు పిలుపునిచ్చారు. బుధవారం జీ20 శిఖరాగ్ర సదస్సు వర్చువల్‌ భేటీ సందర్భంగా జీ20 దేశాధినేతలనుద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఉగ్రవాదం కారణంగా ప్రపంచంలో ఎక్కడ పౌరులు మరణించినా తీవ్రంగా ఖండించాల్సిందే. బందీలను వదిలేస్తామంటూ హమాస్‌ మిలిటెంట్లు ప్రకటించడం నిజంగా స్వాగతించాల్సిన విషయం.

గాజాలో నిరంతర మానవతా సాయం అందించడం తప్పనిసరి. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం ప్రాంతీయ సంక్షోభంగా పరిణామం చెందకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది. పశి్చమాసియాలో శాంతి, సుస్థిరత నెలకొనాలి’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగమవడం ఆందోళకరం.

ఈ విషయంలో భారత వైఖరి సుస్పష్టం. ఏఐ రంగం అంతర్జాతీయ క్రమబద్దీకరణకు ప్రపంచదేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్‌ సిద్దంగా ఉంది’’ అని మోదీ స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో మాదిరి గాజా స్ట్రిప్‌లో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం తనను షాక్‌కు గురిచేసిందని భేటీ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యాఖ్యానించారు. వర్చువల్‌ భేటీలో బ్రెజిల్, యూఏఈ, రష్యా, కెనడా, బంగ్లాదేశ్‌ దేశాధినేతలతోపాటు ఐరాపా కమిషన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సారథులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు