-

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’

27 Nov, 2023 09:13 IST|Sakshi

కౌలాలంపూర్‌: విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్‌. తాజాగా మలేషియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వెల్లడించారు. అయితే, ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

వివరాల ప్రకారం.. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగానే పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వెల్లడించారు. ఈ సందర్బంగా మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. 

ఈ క్రమంలో చైనా, భారత పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందని స్పష్టంచేశారు. తమ దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని వెల్లడించారు. ఇక, భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్‌, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించాయి. నవంబర్‌ 10 నుంచి థాయిలాండ్‌ దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇక, భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అక్టోబర్‌ నెలలోనే శ్రీలంక అనుమతినిచ్చింది. 

మరిన్ని వార్తలు