విధేయతకు పట్టం

12 Aug, 2020 13:06 IST|Sakshi
సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు(ఫైల్‌) 

పెనుమత్స సరేష్‌బాబుకు ఎమ్మెల్సీగా అవకాశం 

సీనియర్‌ నాయకుడు సాంబశివరాజుకు నిజమైన నివాళి 

పెద్దాయన మనసెరిగి టిక్కెట్టు ఖరారు చేసిన సీఎం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విధేయతకు సరైన గుర్తింపు లభించింది. వైఎస్సార్‌ సీనియర్‌ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్‌ సూర్యనారాయణరాజు(సురేష్‌ బాబు)ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్‌ బాబు పేరును మంగళవారం ఖరారు చేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీ పురోభివృద్ధికిసాంబశివరాజు అహర్నిశలూ కృషి చేశారు. వయోభారంతో కొద్దికాలంగా ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. అనారోగ్యంతో సోమవారం ఆయన కన్నుమూశారు. పెద్దాయన మరణంతో ఆయన కుటుంబసభ్యులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించి, డాక్టర్‌ సురేష్‌ బాబు ను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మంగళవారం ఆయన పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేశారు. 

13న నామినేషన్‌ దాఖలు 
ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్‌సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సురేష్‌ బాబు, 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి ఓటమిచెందారు. అయినప్పటికీ నిత్యం పార్టీ కార్యక్రమా ల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి బరిలోకి దింపాలని సాంబశివరాజు యత్నించినా రాజకీయ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలోనే ఆ కుటుంబా నికి తగిన గుర్తింపునిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తున్నారు. కాగా గురువా రం ఉదయం నామినేషన్‌ దాఖలుచేయనున్నట్లు సురేష్‌ బాబు ’సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. 

సురేష్‌బాబు గురించి సంక్షిప్తంగా 
పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్‌ బాబు) 
విద్యార్హత: బీడీఎస్‌(డెంటల్‌) 
వృత్తి: డెంటిస్ట్‌ 
పుట్టిన తేది: 6.7.1966 
చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం) 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డెంటల్‌ కౌన్సిల్‌ మెంబర్‌(డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రభుత్వం) 
ఇండియన్‌ డెంటిస్ట్స్‌ ప్రెసిడెంట్‌  
వైఎస్సార్‌సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త 
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా