సామాజిక న్యాయం పరిఢవిల్లుతోంది

9 Nov, 2023 04:42 IST|Sakshi
పాలకొల్లులో జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి పినిపే విశ్వరూప్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక సాధికారతను సాకారం చేసిన సీఎం జగన్‌

ఈ వర్గాలకు అండగా ఉన్నారు.. రాజకీయంగా సముచిత స్థానం ఇచ్చారు

పాలకొల్లు సామాజిక సాధికార సభలో మంత్రి చెల్లుబోయిన

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నతికి పాటుపడుతున్న సీఎం జగన్‌: మంత్రి విశ్వరూప్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం పరిఢవిల్లుతోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక సాధికారత కలను సాకారం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ న్యాయం చేశారని మంత్రి అన్నారు. సీఎం జగన్‌ ఈ వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలబడటంతోపాటు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని తెలిపారు. 

చెబితే తప్పకుండా చేసే నేత సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏదైనా చెబితే దానిని తప్పకుండా చేసే నాయకుడని మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు. అధికారంలోకి వస్తే పింఛన్‌ను అంచెలంచెలుగా రూ.3 వేలు చేస్తానని చెప్పారని ఆ విధంగానే పెంచి ఈ జనవరి నుంచి రూ.3 వేలు ఇవ్వనున్నారని వివరించారు. 2014లో జగన్‌ రూ.750 పెన్షన్‌ ఇస్తానని మేనిఫెస్టోలో ముందుగానే ప్రకటించడంతో చంద్రబాబు రూ.1,000 ఇస్తానని ప్రకటించాడే తప్ప ప్రజలపై ప్రేమ లేదని అన్నారు.

2019లో కూడా జగన్‌ పెన్షన్‌ను రూ.2 వేలు చేస్తానని ప్రకటించగానే ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు చంద్రబాబు రూ.2 వేలు చేసి ప్రజలను మోసం చేయాలని చూశాడని తెలిపారు. సీఎం జగన్‌ 4.40 లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన మనసున్న నేత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, వారి ఉన్నతికి పాటుపడుతున్న సీఎం జగన్‌కు అందరం మరోసారి మద్దతివ్వాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి జరగాలంటే 2024లో కూడా సీఎం జగన్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
పాలకొల్లులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం 

సంక్షేమం అందిస్తున్న సీఎం జగన్‌: మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు
శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏ విధంగా సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని అంబేడ్కర్‌ భావించారో, అలాగే సీఎం జగన్‌ ఈ వర్గాలను అభివృద్ధిలోకి తెస్తున్నారని తెలిపారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియం విద్య, అమ్మఒడి వంటి పథకాలతో పేదలను విద్యాధికులను చేస్తున్నారని తెలిపారు. 

బడుగుల నాయకుడు సీఎం జగన్‌ : ఎంపీ నందిగం సురేష్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బడుగుల నాయకుడని ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో విధాలుగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్‌ వేలు తాడేపల్లిలోని జగన్‌మోహన్‌రెడ్డిని చూపిస్తూ ఆయన ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నట్లు ఎప్పుడూ చెబుతుందని అన్నారు. చంద్రబాబు తమను జైల్లో పెట్టాలని చూస్తే వైఎస్‌ జగన్‌ వాళ్లు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంటులో అంటూ తనను లోక్‌సభలో కూర్చోబెట్టారని తెలిపారు.

ప్రతి పేద పిల్లవాడు ఐఏఎస్, ఐపీఎస్‌ అయ్యేలా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నతంగా తీర్చిదిద్దుతు­న్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలు సహా అన్ని వర్గాలు బాగుపడాలంటే 2014లోనూ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపు­ని­చ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు