బడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచారు.. 

5 Nov, 2023 04:34 IST|Sakshi
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, చిత్రంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ ఎంతో చేస్తున్నారు 

ధర్మవరం సామాజిక సాధికార సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా 

బీసీలకు స్వర్ణ యుగం: మంత్రి గుమ్మనూరు జయరాం 

మరోసారి జగన్‌ను గెలిపించుకోవాలి : మాజీ మంత్రి అనిల్‌  

సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని, అందుకే ఈ వర్గాలకు అన్ని పథకాలు, పదవుల్లో పెద్ద పీట వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌ ఒక వరమని అన్నారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడారు.

నాలుగున్నరేళ్ల సీఎం జగన్‌ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచారని తెలిపారు. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడంతోపాటు ఓ మహిళకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇచ్చారని కొనియాడారు. టీడీపీ హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. 

బీసీల సత్తా చాటుదాం 
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సామాజిక సాధికారతకు కృషి చేసి, ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్‌కు మద్దతిచ్చి బీసీల సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ప్రతి కులానికీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్‌ పదవులు కట్టబెట్టి గుర్తింపు తెచ్చారన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలకు సభ్యత్వం కల్పించారన్నారు. జగనన్న చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక.. చంద్రబాబు అండ్‌ కో అనేక కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీలందరూ ఏకతాటిపై నిలిచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

‘కులగణన’ సాహసోపేత నిర్ణయం  
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం సాహసోపేత నిర్ణయమన్నారు. కులగణన పూర్తయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రస్తుతం కల్పించిన ప్రాధాన్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ హరీష్ కుమార్‌ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. 

బీసీలకు స్వర్ణయుగం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి సీఎం వైఎస్‌ జగన్‌ అవిరళ కృషి చేస్తున్నారని  శ్రీసత్యసాయి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ చెప్పారు.మంత్రి వర్గం, నామినేటెడ్‌ పోస్టులు, స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.

ప్రతి ఇంటికీ పెద్ద కుమారుడిలా పింఛన్, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో పాటు ఇంటి స్థలం ఉచితంగా ఇచ్చారని, ఇంటి నిర్మాణానికి కూడా తోడ్పడుతున్నారని వివరించారు. జగన్‌ పాలన బీసీలకు స్వర్ణ యుగమని అన్నారు. మరోసారి జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ ఉందన్నారు.  

మరిన్ని వార్తలు