మీవాడు సీఎం కాకపోతే.. ఇంత ఫ్రస్ట్రేషనా! 

21 Aug, 2021 07:57 IST|Sakshi

ప్రభుత్వ స్కూళ్ల దుస్థితికి పదేళ్ల చంద్రబాబు, సైకిల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కారణం కాదా!

నాడు–నేడు ద్వారా కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ స్కూళ్ల అభివృద్ధి

పేదవాడి బాగు కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు పెడితే మీకెందుకు కడుపు మంట

జగన్‌ పాలనలో మంచి.. చంద్రబాబు పాలనలో చెడు ఎల్లో మీడియాకు కనిపించవా

రాష్ట్రం బాగుపడుతుంటే ‘చంద్రబాబు అండ్‌ కో’కి నిద్రపట్టడం లేదా!

సాక్షి, అమరావతి: ‘మీవాడు ముఖ్యమంత్రి కాకపోతే ఇంత ఫ్రస్ట్రేషనా.. అబద్ధాలు, అసత్యాలతో కూడిన వార్తలను ప్రతిరోజూ ఎల్లో మీడియాలో వండి వారుస్తూ ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లుతారా’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమవాడు సీఎం కాకపోతే వీరి ఫ్రస్ట్రేషన్‌ ఇంత పీక్‌లో ఉంటుందా అన్నట్టుగా సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రభుత్వంపైన, సీఎం జగన్‌పైన పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనలో జరుగుతున్న మంచి.. చంద్రబాబు పాలనలో జరిగిన చెడు ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లోనే రూ.1.40 లక్షల కోట్లను పేదవాడి బాగు కోసం ఖర్చు చేస్తే మీకెందుకు కడుపుమంట అని నిలదీశారు. పేదవాడు బాగుపడితే.. రైతు బాగుపడితే.. తద్వారా రాష్ట్రం బాగుపడితే.. చంద్రబాబు అండ్‌ కో కి నిద్రపట్టదా అని ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..  

పాఠశాలల దుస్థితికి చంద్రబాబు కారణం కాదా? 
‘సీఎం ఇంటి పక్కనే ఇలా..’ అంటూ ఈనాడులో తాడేపల్లిలోని రెండు స్కూళ్ల ఫొటోలతో ఓ వార్త రాశారు. టీడీపీ హయాంలో బడుల్లో కనీసం బెంచీలు, కుర్చీలు, టేబుళ్లు, బ్లాక్‌ బోర్డులకు కూడా నోచుకోక ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అన్న దానికి ఆ వార్త అద్దం పడుతోంది. పదేళ్ల సైకిల్‌ కాంగ్రెస్‌ పాలనలో నాశనమైన ప్రభుత్వ బడులకు ఇది నిదర్శనం. మరోవైపు జగనన్న పాలనలో ఇలాంటి స్కూళ్లకు ఎలా మోక్షం కలుగుతోందో కూడా అందరికీ అర్థమవుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క సర్కారు బడినీ కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా సీఎం వైఎస్‌ జగన్‌ మారుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల ప్రభుత్వ బడులను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో దాదాపు రూ.3,700 కోట్లు ఖర్చు చేసి 15,715 పాఠశాలలను అభివృద్ధి చేశారు. రెండోదశ పనులకూ శ్రీకారం చుట్టారు. స్కూళ్ల అభివృద్ధికి ఏకంగా రూ.16 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. ఇది అభివృద్ధిలా కనిపించటం లేదా. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లి, ప్రతి బిడ్డలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. బహుశా తమ కార్పొరేట్‌ స్కూళ్ల బేరాల కోసమే ఈ పద్ధతిలో ఎల్లో మీడియా వార్తలు రాస్తుందా. విద్యార్థుల జీవితాలను మార్చేందుకు స్కూళ్లను అభివృద్ధి చేస్తుంటే.. వాస్తవాలు రాయాలని ఈనాడుకు ఎందుకు అనిపించలేదు. కనీసం సూచనలు, సలహాలు ఇస్తూ అన్నా రాశారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఊళ్లో.. నారావారిపల్లె పక్కనే చంద్రబాబు చదువుకున్న స్కూల్‌ శిథిలావస్థకు చేరితే దాన్ని జగన్‌ అధికారంలోకి వచ్చాక తప్ప బాగు పడలేదు. ఇవి ఈనాడుకు, మిగతా ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించవు.   

అప్పులు పుట్టకూడదని పిటిషన్‌ వేయించింది వాళ్లు కాదా 
రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టకూడదని, స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు బ్యాంకుల నుంచి రుణాలు రాకూడదనే దురుద్దేశంతో నళినీ కుమార్‌ అనే ఈనాడు అడ్వకేట్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో పిటిషన్‌ వేయించింది రామోజీ, చంద్రబాబు కాదా. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ రూ.లక్షన్నర కోట్లు అప్పులు చేసి తన కాంట్రాక్టర్లకు, బినామీలకు దోచిపెట్టింది. సీఎం జగన్‌ రూ.1.40 లక్షల కోట్లను సంక్షేమ కార్యక్రమాల ద్వారా డీబీటీ విధానంలో ఒక్క పైసా అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి అందేవిధంగా చూస్తున్నారు. చేతనైతే వాస్తవాలు రాయండి, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇటీవల కాలంలో మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే మాటలను వక్రీకరించి మిమిక్రీ ఆర్టిస్టులతో రికార్డు చేసి.. వైఎస్సార్‌సీపీని, ప్రభుత్వాన్ని అభాసు పాల్జేయాలని కొందరు చూస్తున్నారు. మీ కుట్రల అంకంలో ఇదే చిట్ట చివరి మెట్టు. రాజకీయాల్లో ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మారండని 
హెచ్చరిస్తున్నాం.  

ఈనాడు రామోజీ పాడు బుద్ధి
‘రైతుల గుండెల్లో మీటర్ల మోత’ అంటూ మరో కథనాన్ని రాశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కరెంటు బకాయిలు కట్టలేదని రైతులపై నిర్దాక్షిణ్యంగా అక్రమ కేసులు పెట్టి, స్పెషల్‌ పోలీస్‌ స్టేషన్లు, స్పెషల్‌ కోర్టులు పెట్టి వేధించినప్పుడు ఒక్క వార్త అయినా రామోజీ రాశారా. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ పగటి పూటే 9 గంటలు ఇస్తుంటే గుండెల్లో మీటర్లు అని రాస్తారా. రాష్ట్రంలోని ప్రతి పొలంలోని ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్‌ వస్తోందా లేదా అన్నది తెలుసుకునేందుకు మీటర్లు పెడుతున్నాం. లో వోల్టేజీ, హై వోల్టేజీతో మోటార్లు కాలిపోకుండా ఉపయోగపడేందుకు ఫీడర్లు, లోడ్‌ సరి చూసుకునేందుకే వీటిని పెడుతున్నాం. వీటివల్ల రైతులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తుంటే, రైతన్నల కోసం కనీవినీ ఎరగని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే మీకు ఎందుకు నచ్చటం లేదు.  

మరిన్ని వార్తలు