పడ: రియల్​ స్టోరీ.. ఆ నలుగురు ఏమయ్యారు, కలెక్టర్ రెడ్డి​ ఆ ట్విస్ట్​ను ఎందుకు నమ్మట్లేదు?

11 Apr, 2022 19:08 IST|Sakshi

వాస్తవ కథ తెర రూపానికి క్రియేటివిటీని జోడించడం షరా మామూలుగా మారింది ఈరోజుల్లో. కానీ, మలయాళ చిత్రం ‘పడ’(సైన్యం)కి అలాంటివేం ఎదురు కాలేదు. ఎందుకంటే.. ఇదొక నాటకీయమైన పరిణామం. నలుగురు అతివాదులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనే పడ చిత్రానికి కథ. ఇందుకోసం ఓ కలెక్టర్​ను కలెక్టర్​ కార్యాలయంలోనే కొన్ని గంటలపాటు బంధించి.. అధికారులతో పాటు రాజకీయ నాయకులనూ హడలెత్తిస్తారు. చివరికి డిమాండ్​ నెరవేర్చే హామీతో.. కలెక్టర్​ నిర్బంధం నుంచి విడిచిపెట్టి, పోలీసులు తమనేం చేయకూడదనే షరతు మేరకు స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తారు. ఆఖర్లో.. మీడియా ముందు తాము తెచ్చినవి డమ్మీ ఆయుధాలంటూ ట్విస్ట్​ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు.


పడ కథ ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఆ నలుగురు అతివాదులు ఏమయ్యారు?. అసలు పాలక్కాడ్​ కలెక్టర్​ బంధీ ఎపిసోడ్​కి ముందు.. తర్వాత ఏం పరిణామాలు జరిగాయి?. ఈ హైడ్రామా చివర్లో ఆ నలుగురు మీడియా ముందు ఇచ్చిన ట్విస్ట్​ను కలెక్టర్ రెడ్డి​ ఎందుకు నమ్మట్లేదు?..

1996 అక్టోబర్​ 4వ తేదీన.. అయ్యన్​కాళి పడ గ్రూప్​ ఉద్యమకారులు కల్లార బాబు, విలయోడి శివన్​కుట్టి, కజంగద్​ రమేషన్​, అజయన్​ మన్నూర్​లు.. అప్పటి  పాలక్కాడ్ జిల్లా​ కలెక్టర్​ డబ్ల్యూఆర్ రెడ్డిని తొమ్మిది గంటలపాటు బంధీ చేశారు. కలెక్టర్​ ఆఫీస్​కు రోజూవారీ వచ్చే ఫిర్యాదుదారుల్లాగా వచ్చి.. తుపాకీ, డైనమెట్​లు చూపించి సిబ్బందిని బెదిరించి కలెక్టర్​ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు తొమ్మిది గంటలకు పైగా ఈ హైడ్రామా నడిచింది. మావోయిస్ట్​ సానుభూతి పరులైన ఈ గ్రూప్​ సభ్యులు.. వివాదాస్పదమైన ఆదివాసీ ల్యాండ్​ బిల్లు రద్దు కోసం ఈ పని చేశారు.  

చాలాకాలం నుంచే రెక్కీ..
1996లో ఈకే నాయర్ నేతృత్వంలోని(ముఖ్యమంత్రి) లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​ సర్కార్​ కేరళ షెడ్యూల్​ తెగల (భూముల బదిలీపై పరిమితి, అన్యాక్రాంతమైన భూముల పునరుద్ధరణ) చట్టాన్ని సవరించింది. ఈ సవరణల ద్వారా తమ భూమిపై ఆదివాసీల హక్కులకు భంగం కలుగుతుందనేది అయ్యన్​కాళి పడ ఆవేదన. అందుకే పాలక్కాడ్​ కలెక్టర్​ డబ్ల్యూఆర్ రెడ్డిని బంధించి.. డమ్మీ ఆయుధాలతో నిరసన వ్యక్తం చేయాలని, తద్వారా దేశం దృష్టిని ఆ అంశంపైకి మళ్లించాలని ప్లాన్​ వేసింది. ఈ మొత్తం ఆపరేషన్​కి రావుణ్ణి మాస్టర్ మైండ్. కల్లార బాబు, విలయోడి శివన్​కుట్టి, కజంగద్​ రమేషన్​, అజయన్​ మన్నూర్ నలుగురు సభ్యులు. తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనుకుని ఈ ఆపరేషన్​కి ముందుకొచ్చారు వాళ్లు. వాస్తవానికి ఈ ఆపరేషన్‌ను చాలాకాలం వాయిదా వేస్తూ వచ్చారు. అందుకుకారణం.. నలుగురిలో ఒకరు వెనుకంజ వేయడం. చివరికి.. ఆవ్యక్తి సైతం ముందుకు రావడంతో పనులు మొదలుపెట్టారు. పాలక్కాడ్ కలెక్టరేట్‌ దగ్గర రెండువారాలు రెక్కీ వేశారు. పర్యావరణ వేత్తల ముసుగులో కలెక్టరేట్​కు వెళ్లారు. ఈ ఆపరేషన్​లో బాబును రాజకీయ మధ్యవర్తిగా, రమేషన్​ మిలిటరీ కమాండర్​ పాత్ర పోషించారు. మార్షల్​ ఆర్ట్స్​లోనూ ఆ నలుగురు శిక్షణ తీసుకున్నారు. గుడ్డు పొరలు, ప్లాస్టిక్​ పైపులు, వైర్లు టేపుతో డమ్మీ డైనమెట్లు, డమ్మీ తుపాకీ.. ఇలా కొంత సామాగ్రిని బ్యాగుల్లో వేసుకుని వెళ్లారు. కూడా ఆకలి తీర్చుకునేందుకు  డ్రైఫ్రూట్స్​, విటమిన్​ సి ట్యాబెట్స్​, బ్రెడ్​ బిస్కెట్లు అరటి పండ్లు మోసుకెళ్లారు. వాస్తవానికి.. వాళ్ల లక్ష్యం డిప్యూటీ కలెక్టర్. కానీ, ఆ ఆఫీస్​ దూరంగా ఉండడంతో.. కలెక్టర్​ను లక్ష్యంగా చేసుకున్నారట. 

తొమ్మిది గంటల హైటెన్షన్‌
1996 అక్టోబర్​ 4వ తేదీన ఉదయం 10.30 ప్రాంతంలో.. కల్లార బాబు, విలయోడి శివన్​కుట్టి, కజంగద్​ రమేషన్, అజయన్​ మన్నూర్ నలుగురు అయ్యన్​కాళి పడ సభ్యులు పాలక్కాడ్ కలెక్టర్​ రెడ్డిని బంధించారు. ఆపై తమ డిమాండ్‌ను సీఎస్ సీపీ నాయర్​​తో పాటు కోజికోడ్​లోని ఏషియన్ నెట్​ ఛానెల్(ఆ టైంకి కేరళలో అదొక్కటే ప్రైవేట్‌ ఛానెల్‌)​కు సమాచారం అందించారు. మధ్యలో కలెక్టర్​ను తన భార్యతోనూ ఫోన్​లో మాట్లాడించి.. ఆమెనూ బెదిరించారు కూడా.  మధ్యలో పోలీసుల బలవంతపు చర్యను అడ్డుకునేందుకు క్రాకర్స్​ మందు గుండును కాల్చి భయపెట్టారట. ఇక మధ్యవర్తిత్వం కోసం ఉద్యమవేత్త ముకుందన్​ మీనన్​, జస్టిస్​ వీఆర్​ కృష్ణ అయ్యర్​.. ఈ ఇద్దరి పేర్లను తొలుత పరిశీలించారు. చివరగా.. అడ్వొకేట్​ వీరచంద్ర మీనన్ మధ్యవర్తిగా వ్యవహరించమని కోరారు. మధ్యవర్తి వీరచంద్ర మీనన్​ చర్చలతో చివరకు హామీ మీద చర్చలకు సిద్ధమయ్యారు. అదే రాత్రి..  జిల్లా జడ్జి కే. రాజప్పన్​ ఆచారీ సమక్షంలో కలెక్టర్​ను వదిలేయడంతో పాటు ఎలాంటి కేసు లేకుండా స్వేచ్ఛగా బయటకు వచ్చేశారు. ఆ నలుగురూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యే జేబులో పైసా లేకుండా వెళ్లారట. అందుకే అడ్వోకేట్​ వీరచంద్ర మీనన్ కారులోనే త్రిస్సూర్​లో దిగి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు.  

వేట.. అరెస్టులు
పాలక్కాడ్ కలెక్టర్‌ బంధీ వ్యవహారంలో కలెక్టర్​ రెడ్డి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదు చేయలేదు. దీంతో జడ్జి ఆచారీ ఎలాంటి కేసులు ఉండవనే హామీ ఇవ్వడంతో పోలీసులను వాళ్లను వదిలేసినట్లు సినిమాలో చూపించారు. కానీ, కలెక్టర్‌ రెడ్డితో బలవంతంగా పోలీసులు కేసు పెట్టించారని శివకుట్టీ ఆరోపిస్తున్నారు. ఆ నలుగురి కోసం వేట ఉధృతిన సాగింది. ఈ నలుగురినే కాదు.. ఆ సమయంలో ఆదివాసి భూహక్కుల కోసం పోరాడిన కొందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు.  ఏడు నెలల తర్వాత.. అజయన్‌ మన్నూర్​ను మువట్టుపులలో పోలీసులు అరెస్ట్​ చేశారు.  ఆపై ఏడాదిన్నరలో రమేషన్​, శివకుట్టీని వయనాడ్​, అట్టపుడి ప్రాంతాల్లో అరెస్ట్​ చేశారు. అయితే నాలుగో నిందితుడు బాబు మాత్రం ఘటన జరిగిన 14 ఏళ్లకు .. అంటే 2010లో పాలక్కాడ్ కోర్టులో సరెండర్​ అయ్యాడు. ఈ వ్యవహారంలో బాబు తప్ప అందరినీ దోషులుగా నిర్ధారించింది కోర్టు. బాబును కలెక్టర్‌ రెడ్డి గుర్తు పట్టకపోవడమే అందుకు కారణం!. వాస్తవానికి ముగ్గురు నిందితులకు పదమూడున్నర ఏళ్ల శిక్ష పడాల్సి ఉందని, కానీ, కుట్రకు సంబంధించిన ఆరోపణలేవీ రుజువు కాకపోవడం, వాళ్లది ఉన్నత లక్ష్యం కావడం, కలెక్టర్​ రెడ్డితో మర్యాదపూర్వకంగా వ్యవహరించినందుకుగానూ నిందితులకు మూడున్నరేళ్లకు శిక్ష తగ్గించింది కోర్టు. ఆపై అభ్యర్థన పిటిషన్‌ల మేరకు.. ఆ శిక్షను ఏడాదికే కుదించారు. ఈ కేసులో అప్పీల్ పిటిషన్‌ ఇంకా కేరళ  హైకోర్టులో పెండింగ్​లోనే ఉంది. ఈ వ్యవహారంలో ఆ నలుగురు మొత్తంగా.. 113 రోజులపాటు రిమాండ్​లో గడిపారు.  


నాటకీయత లేదు కానీ.. 
ఆంధ్రప్రదేశ్‌ అబ్దుల్లాపురంలో పుట్టిన డబ్ల్యూఆర్ రెడ్డి.. కేరళ 1986 క్యాడర్‌కు చెందిన అధికారి. అయితే పాలక్కాడ్ ఘటన తర్వాత రాజకీయంగానూ ఆయన విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆయన మావోయిస్టుల సానుభూతిపరుడని, పలక్కడ్‌ ఘటనలో నిందితులకు సహకరించారనే విమర్శల్ని ఎల్‌డీఎఫ్‌ గుప్పించింది. అయితే.. రాజకీయాల్లో, ప్రత్యేకించి కేరళ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అంటున్నారు ఆయన. విమర్శలను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు.  పడ కథలో నాటకీయత అనే అంశం కనిపించలేదు. చాలా బాగా తీశారు. క్లైమాక్స్‌లో మీడియా వాళ్లను ప్రశ్నిస్తున్నప్పుడు, వారు కేవలం బొమ్మ పిస్టల్ మరియు నకిలీ పేలుడు పదార్థాలను మాత్రమే తీసుకెళ్లారని చెప్పారు. వారు ఆయుధాలు కలిగి ఉన్నారని నేను 'అనుకోవడం' లేదు. ఎందుకంటే వారు నిజంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నాకు తెలుసు. ఆ విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. వారి బ్యాగ్‌లను తనిఖీ చేయడానికి, వారి వాదనను ధృవీకరించడానికి ఎవరు ఆ సమయానికి ప్రయత్నించలేదు. బదులుగా, కథనాన్ని వేగంగా మార్చడంలో వాళ్లు విజయం సాధించారు. ఇదంతా జర్నలిజం వైఫల్యంగా నేను భావిస్తున్నాను. వాళ్లు నాకు ఎలాంటి హాని తలపెట్టలేదని, మర్యాదపూర్వకంగా వ్యవహరించారని మాత్రమే జడ్జి ముందు చెప్పాను. అంతేగానీ కేసు పెట్టనని అనలేదు(బహుశా అది దర్శకుడి క్రియేటివిటీ ఏమో!). ఆ మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేశా. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి నాపై లేదు అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు రెడ్డి. కేరళలో కొన్నాళ్లపాటు పని చేసిన తర్వాత కేంద్రం సర్వీసులకు ఆయన బదిలీపై వెళ్లారు.  


నటుడు అర్జున్‌ రాధాకృష్ణన్‌(ఎడమ)..  డబ్ల్యూఆర్‌ రెడ్డి (ఫైల్‌ ఫొటో.. కుడి వైపు)
   
పాలక్కాడ్ కలెక్టర్‌ బంధీ ఉదంతంలో.. డమ్మీ ఆయుధాలతో పది గంటలపాటైన నిలువరించగలిగామని చెప్తున్నారు అజయన్​. అయితే అప్పటి సీఎం ఈకే నాయర్.. ఆ ఘటన జరిగిన సమయానికి ఎమ్మెల్యే కూడా కాదు. తలస్సెరీ బై ఎలక్షన్ హడావిడిలో ఉన్నారాయన. ఆ ఎన్నికలు ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే కలెక్టర్​ను కాపాడాలనే ప్రయత్నాలు చేయించారు. ఒకవేళ.. ఈరోజుల్లో గనుక అలాంటి ఘటనే జరిగి ఉంటే.. ఈపాటికే చచ్చి ఉండేవారేమో అంటున్నారు ఆ నలుగురు. మరి ఇంత చేసి.. వాళ్ల డిమాండ్‌ ఏమైంది?.. ఎవరూ పట్టించుకోలేదు. మీడియా అదంతా బంధీ నాటకంగా అభివర్ణించింది. ఆ తర్వాత ఆ విషయమూ, బంధీ వ్యవహారమూ కనుమరుగు అయి పోయాయి.


పడ సినిమా షూటింగ్‌లో దర్శకుడు కమల్‌

దళిత నేత అయ్యన్​కాళి పేరిట వెలిసిన రెబల్‌ గ్రూప్(మావోయిస్ట్‌ సానుభూతి).. అయ్యన్‌కాళి పడ​. ప్రస్తుతం ఈ నలుగురు ఉద్యమవేత్తలుగా క్రియాశీలకంగా ఉన్నారు.  కలెక్టర్‌ను బంధించిన ఘటన ఆధారంగానే.. 

జర్నలిస్ట్​ కమ్‌ దర్శకుడు అయిన కేఎం కమల్ ‘పడ’ సినిమాను తీశాడు. ప్రకాశ్​ రాజ్​, కున్​జక్కో బోబన్​, దిలీశ్​ పోతన్​, ఇంద్రన్స్​, సలీం కుమార్​, వినాయకన్​, జోజు జార్జ్​ లాంటి తారాగణంతో సినిమాను తెరకెక్కించాడు. పాలక్కాడ్ కలెక్టర్‌ బంధీ ఘటన జరిగిన సమయంలో కమల్‌ జర్నలిజం డిప్లోమా స్టూడెంట్​గా ఉన్నాడట. 2018 నుంచి నాలుగేళ్లపాటు ఈ ఉదంతంలో ఉన్న అందరినీ కలుసుకుని.. సినిమాగా తెరకెక్కించాడు. క్యారెక్టర్ల పేర్లకు మాత్రమే కొంచెం మార్పులు చేశాడు. అందుకే సినిమా పట్ల ఆ నలుగురే కాదు.. ఎవరూ పెద్దగా అభ్యంతరాలేవీ వ్యక్తం చేయలేదు.

పడ మూవీ.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది

మరిన్ని వార్తలు