Andy Murray: అదరగొట్టిన ముర్రే.. ఐదేళ్ల నిరీక్షణకు తెర

18 Jan, 2022 17:10 IST|Sakshi

బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌.. మాజీ ప్రపంచనెంబర్‌వన్‌ ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను ఘనంగా ఆరంభించాడు. జార్జేరియాకు చెందిన 21వ సీడ్‌ నికోలోజ్ బాసిలాష్విలితో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 6-1, 3-6,6-4,6-7(5), 6-4 తేడాతో ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. వీరిద్దరు దాదాపు 3 గంటల 52 నిమిషాల పాటు హోరాహోరిగా తలపడినప్పటికి.. ముర్రే ఆద్యంతం ఆధిపత్యం చెలాయించాడు. తొలి సెట్‌ను 6-1 తేడాతో గెలిచిన ముర్రే రెండో సెట్‌ను మాత్రం 3-6తో ప్రత్యర్థికి కోల్పోయాడు. అయితే తనదైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌, ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో అలరించిన ముర్రే మూడో సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు. ఇక నాలుగో సెట్‌ టై బ్రేక్‌కు దారి తీసినప్పటికి కీలకమైన ఐదో సెట్‌ను 6-4తో గెలుచుకొని ముర్రే రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో టోర్నీ నిర్వాహకులు ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు. మ్యాచ్‌ విజయం అనంతరం ముర్రే భావోద్వేగానికి లోనవ్వడం వైరల్‌గా మారింది.

చదవండి: ఫుట్‌బాల్‌ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి

ఇక 2017లో ఆఖరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన ముర్రే.. 2018లో గాయంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరంగా ఉన్నాడు. ఇక 2019లో చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడాడు. అయితే తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన ముర్రే భావోద్వేగానికి గురయ్యాడు. అప్పటికే తుంటి ఎముక గాయం బాధిస్తుండడంతో తాను ఇక టెన్నిస్‌ ఆడనేమోనని.. ఇది చివరిదని ఎమోషనల్‌ కావడం అభిమానులను బాధించింది. తుంటి ఎముకకు సంబంధించి సర్జరీ చేయించుకున్న ముర్రే తన ఆటలో పదును పెంచుకున్నాడు.

ఇప్పటివరకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఐదుసార్లు ఫైనల్‌ చేరిన ముర్రేకు అన్నిసార్లు భంగపాటే ఎదురైంది. ఒక ఫైనల్లో రోజర్‌ ఫెదరర్‌ చేతిలో ఓడిన ముర్రే.. మిగతా నాలుగు ఫైనల్స్‌లో జొకోవిచ్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈసారి ఎలాగైనా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను కొట్టాలన్న కసితో ఉన్న ముర్రే.. తొలి రౌండ్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇక ముర్రే ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను సాధించాడు. 2012లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన ముర్రే.. ఆ తర్వాత 2013లో వింబుల్డన్‌ గెలిచి 77 ఏళ్ల తర్వాత టైటిల్‌ గెలిచిన బ్రిటీష్‌ ప్లేయర్‌గా ముర్రే చరిత్రకెక్కాడు. మళ్లీ 2016లోనూ ముర్రే వింబుల్డన్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

చదవండి: అలా అయితే నువ్వు మాకొద్దు!

>
మరిన్ని వార్తలు