Tata Steel India 2022 Rapid R1-3: రన్నరప్‌ అర్జున్‌... హారికకు మూడో స్థానం

2 Dec, 2022 09:33 IST|Sakshi

కోల్‌కతా: టాటా స్టీల్‌ ఇండియా చెస్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ రన్నరప్‌గా నిలువగా... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని దక్కించుకుంది. అర్జున్‌కు ఐదు వేల డాలర్లు (రూ. 4 లక్షలు), హారికకు నాలుగు వేల డాలర్లు (రూ. 3 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గురువారం ముగిసిన ర్యాపిడ్‌ టోర్నీ లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్‌ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఏడో రౌండ్‌లో మగ్సూద్‌లూ (ఇరాన్‌)తో 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, ఎనిమిదో రౌండ్‌లో 56 ఎత్తుల్లో నకముర (అమెరికా)పై, తొమ్మిదో రౌండ్‌లో 59 ఎత్తుల్లో నిహాల్‌ సరీన్‌ (భారత్‌)పై గెలిచాడు. 6.5 పాయింట్లతో నిహాల్‌ విజేతగా నిలువగా, భారత్‌కే చెందిన విదిత్‌ 4.5 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

మహిళల విభాగంలో హారిక 5.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించింది. ఏడో రౌండ్‌ గేమ్‌ను అన్నా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌) తో 22 ఎత్తుల్లో, ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను మరియా (ఉక్రెయిన్‌)తో 25 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హారిక తొమ్మిదో రౌండ్‌లో 30 ఎత్తుల్లో సవితాశ్రీ (భారత్‌)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో   గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. అనా ఉషెనినా (ఉక్రె యిన్‌) 6.5 పాయింట్లతో విజేతగా నిలిచింది.  

మరిన్ని వార్తలు