IND vs AUS World Cup Final: సూర్యకుమార్‌ ఔట్‌.. అశ్విన్‌ ఇన్‌!? క్లారిటీ ఇచ్చిన రోహిత్‌ శర్మ

19 Nov, 2023 10:04 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 మెగా ఫైనల్‌కు సర్వం సిద్దమైంది.  ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాను చిత్తుచేసి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు అన్నివిధాల సన్నద్దమయ్యాయి.

కాగా ఈ మ్యాచ్‌కు భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ లేదా సూర్యకుమార్‌ యాదవ్‌ను పక్కనపెట్టి అశ్విన్‌కు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఇదే విషయంపై ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్లారిటీ ఇచ్చాడు.

"మొత్తం 15 మంది ఆటగాళ్లు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం 12-13 మంది ఆటగాళ్లను సిద్దం చేశాము. ఇంకా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఖరారు చేయలేదు. మ్యాచ్‌ రోజు పిచ్, పరిస్థితులు బట్టి తుది జట్టును ఎంపిక చేస్తామమని" రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ​​కాగా అశ్విన్‌కు ఆస్ట్రేలియాపై మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు అతడి బౌలింగ్‌ స్టైల్‌ను పోలి ఉన్న నెట్‌బౌలర్‌తో ఆసీస్‌ చాలా సందర్భాల్లో ప్రాక్టీస్‌ చేసింది కూడా! 

ఈ నేపథ్యంలో ఈ సీనియర్‌ ఆటగాడి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భారత జట్టు మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇ​క అశ్విన్‌ ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. లీగ్‌ దశలో చెపాక్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. 8 ఓవర్లు వేసిన అశూ.. 34 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

మరిన్ని వార్తలు