CWC 2023: విధ్వంసకర వీరులు ఉన్నా.. ఆ ప్రశ్నలకు జవాబు దొరకడం కష్టమే! ఏకపక్షంగా ఉండదు!

19 Nov, 2023 08:13 IST|Sakshi

ICC CWC 2023 Final Ind Vs Aus: ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు విజయవంతంగా ముందుకు వేస్తే పుష్కర కాలం తర్వాత టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడగలదు. సొంతగడ్డపై 2011లో ధోని సేన మిగిల్చిన మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్న అభిమానులకు మరిన్ని కొత్త అనుభూతులను అందించగలదు. ఇందుకోసం రోహిత్‌ సేన ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైంది.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో అజేయ రికార్డును కొనసాగిస్తూ విజయ లాంఛనం పూర్తి చేసేందుకు సన్నద్ధంగా ఉంది. టైటిల్‌ సొంతం చేసుకునేందుకు పక్కా వ్యూహాలు, ప్రణాళికలు తయారు చేసుకుంది. మరి టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!!

శిఖరాన కోహ్లి.. రోహిత్‌, అయ్యర్‌ సైతం
స్వదేశంలో జరుగుతున్న ఈ ఐసీసీ టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత భారత్‌ తమ తుది జట్టును మార్చింది. గత ఆరు మ్యాచ్‌లలో అదే టీమ్‌ ప్రత్యర్థి జట్లను ఓడించింది. ఫలితాలు అద్భుతంగా రావడంతో పాటు ప్రతీ ఆటగాడు తనదైన రీతిలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

కాబట్టి తుది జట్టును మార్చాల్సిన అవసరమే రాలేదు. బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లి 711 పరుగులతో శిఖరాన ఉండగా, రోహిత్‌ శర్మ ఏకంగా 125 స్ట్రయిక్‌రేట్‌తో 550 పరుగులు చేశాడు. ఆరంభంలో తడబడిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆ తర్వాత చెలరేగి 526 పరుగులు సాధించాడు.

గిల్‌, రాహుల్‌ విలువైన ఇన్నింగ్స్‌
డెంగీ జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైనా... ఆ తర్వాత కూడా నాలుగు అర్ధ సెంచరీలు సాధించి వందకు పైగా స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతున్న శుబ్‌మన్‌ గిల్‌ కూడా రోహిత్‌కు సరైన ఓపెనింగ్‌ జోడీగా నిలిచాడు.

కేఎల్‌ రాహుల్‌ కీలక దశలో తన విలువేమిటో చూపించగా... సూర్యకుమార్‌ కూడా అవకాశం దక్కితే చెలరేగిపోగలడు. ఇలాంటి టాప్‌–6 బ్యాటింగ్‌ దళంతో టీమిండియా విజయంపై అంచనాలు పెంచుతోంది.

ఆసీస్‌కు అంత ఈజీ కాదు
ఆ ఆర్డర్‌ను నిలువరించడం ఆసీస్‌కు అంత సులువు కాదు. అందరూ వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న ఐదుగురు బౌలర్ల బృందంతో టీమిండియా మరింత బలంగా ఉంది. ఆస్ట్రేలియాతో లీగ్‌ మ్యాచ్‌ ఆడని షమీని ఆ జట్టు ఫైనల్లో ఏమాత్రం ఎదుర్కోగలదనేది చూడాలి. బుమ్రా, సిరాజ్‌ కూడా ఆరంభంలో ప్రత్యర్థిని కట్టిపడేయగలరు. ఇక రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ విసిరే స్పిన్‌ ప్రశ్నలకు ఆసీస్‌ వద్ద జవాబు దొరకడం కష్టమే.  

వారికి ఓపెనర్లే బలం... 
వరల్డ్‌ కప్‌ తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి పేలవంగా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఒక్కసారిగా తమదైన శైలిలో పుంజుకుంది. వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన ఆ టీమ్‌ కూడా ఫైనల్‌కు అన్ని విధాలుగా సన్నద్ధమైంది.

టాప్‌–3లో డేవిడ్‌ వార్నర్, ట్రవిస్‌ హెడ్, మిచెల్‌ మార్ష్ లు ఒకే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్‌ చేయగల సమర్థులు కావడం జట్టు ప్రధాన బలం. పవర్‌ప్లేలోనే వీరు తమ ఆటతో మ్యాచ్‌ గమనాన్ని శాసించగలరు. పరిస్థితి మారితే జట్టును ఆదుకునేందుకు తర్వాతి స్థానాల్లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల స్టీవ్‌ స్మిత్, లబుషేన్‌ ఉన్నారు.

బ్యాటింగ్‌ బలహీనతలు
కనీసం 30 ఓవర్లు దాటాక క్రీజ్‌లోకి వస్తే మ్యాక్స్‌వెల్‌ మరింత ప్రమాదకరంగా మారిపోగలడు. అయితే గత కొంత కాలంగా కొన్ని మ్యాచ్‌లలో అనూహ్యంగా కుప్పకూలిన రికార్డు కూడా ఆసీస్‌కు ఉంది. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో కూడా ఆ జట్టు బ్యాటింగ్‌ బలహీనతలు బయట పడ్డాయి.

దాంతో అంత ఆసీస్‌ అభేద్యమైన జట్టేమీ కాదని తేలిపోయింది. ఫైనల్లో దీనిని ఆ జట్టు సవరించుకోవాలి. బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌ మాత్రమే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలుగుతున్నాడు.

కాస్త వెనుకబడే ఉన్నా
కమిన్స్‌ కీలక సమయాల్లో వికెట్లు తీసినా... ఆరంభంలో గతి తప్పి భారీగా పరుగులిచ్చే స్టార్క్‌ నియంత్రణ పాటించాల్సి ఉంది. ఆడమ్‌ జంపా స్పిన్‌ భారత్‌లాంటి జట్టుపై ఏమాత్రం పని చేస్తుందనేది చూడాలి. ఓవరాల్‌గా భారత్‌తో పోలిస్తే ఆసీస్‌ కాస్త వెనుకబడే ఉంది. కానీ అసలు సమయాల్లో తమలోని పోరాటపటిమను చూపించే తత్వమే ఆ జట్టు బలం.  

పిచ్, వాతావరణం 
సాధారణ బ్యాటింగ్‌ పిచ్‌. పూర్తిగా అటు బ్యాటింగ్‌కు గానీ, ఇటు బౌలింగ్‌కు కానీ ఏకపక్షంగా స్పందించని పిచ్‌ ఇది. నిలదొక్కుకుంటే చక్కగా పరుగులు రాబట్టవచ్చు. బౌలర్లూ ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఇదే పిచ్‌పై జరిగింది. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు. ఫైనల్‌కు సోమవారం రిజర్వ్‌ డే ఉంది. 

చదవండి: World Cup 2023 Final: బ్యాటింగా.. బౌలింగా? భారత్‌ టాస్‌ గెలిస్తే తొలుత ఏమి చేయాలి?

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు