IND VS HK: సూర్యకుమార్‌ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌

31 Aug, 2022 21:37 IST|Sakshi

ఆసియా కప్‌ 2022లో భాగంగా బుధవారం (ఆగస్ట్‌ 31) హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 59 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరిలో సూర్యకుమార్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి పసికూనపై వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హరూన్‌ రషీద్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. 

సూర్య.. తన హాఫ్‌ సెంచరీని కేవలం 22 బంతుల్లోనే పూర్తి చేశాడంటే, అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉండిందో అర్ధమవుతుంది. మరో ఎండ్‌లో కోహ్లి కూడా బాధ్యతాయుతంగా ఆడి టీ20ల్లో 31వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లి సైతం చెత్త బంతులను భారీ సిక్సర్లుగా మలచి, చాలాకాలం తర్వాత కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. కోహ్లి బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌, సూర్య ప్రతాపం ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అంతకుముందు టీమిండియా టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (39 బంతుల్లో 36; 2 సిక్సర్లు) భారీ స్కోర్‌ చేయాలనే లక్ష్యంతో నెమ్మదిగా ఆడి విసుగు తెప్పించాడు. హాంగ్‌కాంగ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ యాసిమ్‌ ముర్తజా (0/27), ఆయుష్‌ శుక్లా (1/29), మహ్మద్‌ గజన్ఫార్‌ (1/19) కాస్త పర్వాలేదనిపించారు. 
చదవండి: టాస్‌ ఓడిన భారత్‌, స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌.. పంత్‌కు ఛాన్స్‌

>
Poll
Loading...
మరిన్ని వార్తలు