Asian Games: భారత్‌ నుంచి భారీ బృందం.. 634 మంది! క్రికెట్‌ జట్లు ఇవే!

26 Aug, 2023 09:31 IST|Sakshi

Asian Games 2023: ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత్‌ 634 అథ్లెట్లతో భారీ బృందాన్ని పంపించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 38 క్రీడాంశాల్లో ఈ బృందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. చైనాలో హాంగ్జూలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. కాగా.. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ నుంచి 572 మంది పాల్గొన్న విషయం విదితమే.

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌కు 34 మంది పురుషులు, 31 మంది మహిళలు మొత్తంగా 65 మంది అథ్లెట్లు.. పురుష, మహిళా జట్లకు సంబంధించి 44 మంది ఫుట్‌బాలర్లు.. హాకీ జట్టు నుంచి మొత్తంగా 36 మంది, క్రికెట్‌ జట్ల నుంచి 30 మంది ఆసియా క్రీడల్లో భాగం కానున్నారు.

స్టార్లంతా
ఇక షూటింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి 30 మంది, సెయిలింగ్‌ కోసం 33 మంది చైనాకు వెళ్లనున్నారు. అయితే, వెయిట్‌లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌బాల్‌, రగ్బీ తదితర విభాగాలకు సంబంధించి లిస్ట్‌ వెల్లడి కావాల్సి ఉంది. 

ఆసియా క్రీడల్లో స్టార్లు నీరజ్ చోప్రా, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛెత్రి, హర్మన్ప్రీత్ సింగ్, బజరంగ్ పూనియా తదితరులు భాగం కానున్నారు.

క్రికెట్‌ జట్లు ఇవే!
ఈసారి భారత్‌ నుంచి మహిళా, పురుష క్రికెట్‌ జట్లు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనుండటం విశేషం. చైనాకు క్రికెటర్లను పంపించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వుమెన్‌ టీమ్‌లోని ప్రధాన క్రికెటర్లంతా ఈ మెగా టోర్నీలో భాగం కానుంగా.. మెన్స్‌ నుంచి ద్వితీయ శ్రేణి జట్టును హాంగ్జూకు పంపనున్నారు.

అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ముంబై బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 స్టార్లు తిలక్‌ వర్మ, యశస్వి జైశ్వాల్‌, రింకూ సింగ్‌ తదితరులతో కూడిన ఈ జట్టు ఆసియా బరిలో దిగనుంది.

ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. 

మహిళా క్రికెట్‌ జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి
స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్

మరిన్ని వార్తలు