WC 2023: అప్పుడు ఆసీస్‌.. ఇప్పుడు దక్షిణాఫ్రికా! 1999 వరల్డ్‌కప్‌ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?

16 Nov, 2023 20:19 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా  49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను మిల్లర్‌(101) అద్బుత సెంచరీతో అదుకున్నాడు.

దీంతో ప్రోటీస్‌ ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల టార్గెట్‌ను ఉంచగల్గింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. అయితే ఆసీస్‌ ముందు స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి సఫారీలు ఇంకా పోటీలో ఉన్నారు.

1999 వరల్డ్‌కప్‌లో షేన్‌ వార్న్‌ మ్యాజిక్‌..
కాగా 1999 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌ జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ మ్యాజిక్‌ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన సెమీస్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 213 పరుగులకు ఆలౌటైంది. 

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్‌లు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్‌ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్‌ కష్టాల్లో పడింది.

ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. ఆ తర్వాత షేన్‌ వార్న్ మళ్లీ తన స్పిన్‌ మయాజాలంతో కల్లిస్‌ను ఔట్‌ చేశాడు. వెంటనే రోడ్స్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను  లాన్స్ క్లూసెనర్‌ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్‌ చేతిలో కేవలం ఒకే వికెట్‌ ఉంది.

క్రీజులో క్లూసెనర్‌తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్‌లో డామియన్  వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్‌ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్‌ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది.

ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్‌ దిశగా షాట్‌గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్‌ కోసం నాన్ స్ట్రైకర్స్‌ ఎండ్‌ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్‌ వికెట్‌ కీపర్‌ గిల్‌క్రిస్ట్‌కు త్రో చేశాడు. గిల్‌క్రిస్ట్‌ను స్టంప్స్‌ను పడగొట్టాడు.

దీంతో మ్యాచ్‌ టై అయింది. అయితే రన్‌రేట్‌ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఎందుకంటే అప్పటిలో సూపర్‌ ఓవర్‌ రూల్‌ ఇంకా అమలులో లేదు. ఈ లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో షేన్‌ వార్న్‌ తన 10 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బౌలింగ్‌ కోటాలో 4 మెయిడన్లు ఉండడం గమనార్హం. ఇప్పుడు వార్న్‌ లాంటి మ్యాజిక్‌ ప్రోటీస్‌ స్పిన్నర్లు ఎవరైనా చేస్తారో లేదో వేచి చూడాలి.
చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్‌ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే!

మరిన్ని వార్తలు